Success Story: తండ్రి బోర్డర్ లో జవాన్..యూట్యూబ్ లో పాఠాలు చూసి డిప్యూటీ కలెక్టర్ అయిన కూతురు!
Success Story: చాలా మంది మొదటి ప్రయత్నంలో విజయం రాకపోతే నిరుత్సాహ పడిపోతారు. అతి తక్కువ మందే అనుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.
ఆగ్రాకు చెందిన దివ్య సికర్వార్(Divya Sikarwar) ఈ కోవకే చెందుతుంది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈ యువతి.. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (UPPSC PCS) 2022 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించింది. యూట్యూబ్ పాఠాలే గైడెన్స్‌గా ప్రిపేర్ అయిన ఈ యువతి లక్ష్యం, సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.
ఆగ్రా సమీపంలోని గర్హి రామి గ్రామానికి చెందిన దివ్య సికర్వార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే యూపిపిఎస్సీ పిసిఎస్ 2022 పరీక్షలో టాపర్‌గా నిలిచింది. డిప్యూటీ కలెక్టర్‌గా సెలక్ట్ అయింది. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆమెకు సివిల్ సర్వీస్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలో మూడుసార్లు UPPSC PCS ఎగ్జామ్ రాసింది. మొదట 2020లో, ఆ తర్వాత 2021లో ఎగ్జామ్స్ రాసింది. ప్రస్తుతం మూడోసారి చేసిన ప్రయత్నంలో విజయం అందుకుంది.
* రోజుకు 8-10 గంటల ప్రిపరేషన్
యూపిపిఎస్సీ పిసిఎస్ 2022 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన దివ్య సికర్వార్ విజయం, సివిల్ సర్వీస్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆమె అంకితభావం, ఆసక్తిని చూపుతుంది. దివ్య పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు ప్రతిరోజూ న్యూస్ పేపర్లు చదివేది. ఈ ఎగ్జామ్ గురించి, ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే సమాజంలో తీసుకురాగలిగే మార్పు గురించి తెలుసుకుంటూ దివ్య ప్రేరణ పొందేది.
UPPSC PCS వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి చాలా సమయం, కృషి అవసరం. పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన దివ్య సికర్వార్, ప్రిలిమినరీ పరీక్ష సమయంలో ప్రతి సబ్జెక్టుకు సమాన సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజూ 8 నుంచి 10 గంటల వరకు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయింది. ఇందులో తరగతులకు హాజరు కావడం, సెల్ఫ్ ప్రిపరేషన్, టైమ్ మేనేజ్‌మెంట్ కోసం రైటింగ్ ప్రాక్టీస్ వంటివి ఉన్నాయి. పరీక్షకు సిద్ధం కావడానికి ఆమె కూడా అన్‌అకాడమీలో చేరింది. ఈ యూట్యూబ్ ఛానల్ గైడెన్స్ ఆమె సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది.
* ఇంటర్వ్యూ సూపర్ పాజిటివ్
UPPSC PCS పరీక్షల్లో చివరి ఇంటర్వ్యూ రౌండ్ సెలక్షన్ ప్రాసెస్‌లో కీలకమైన భాగం. దివ్య సికర్వార్ ఇంటర్వ్యూ రౌండ్‌లో పాజిటివ్ ఆట్టిట్యూడ్‌తో సమాధానాలు ఇచ్చింది. ఇంటర్వ్యూలో చూపిన కాన్ఫిడెన్స్, UPPSC PCS 2022 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించడంలో ఆమెకు సహాయపడింది. ఇంటర్వ్యూ ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిజిటల్ బయోమెట్రిక్ సబ్మిషన్, బోర్డు సభ్యులతో ఇంటర్వ్యూ ఉంటాయి.
దివ్య సికర్వార్ తండ్రిది రైతు కుటుంబం. ఆయన ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉన్నారు. ఆమె సోదరుల్లో ఒకరు ప్రస్తుతం UPSC ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నారు. దివ్య ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజీలో సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమె 10వ తరగతిలో 77%, 12వ తరగతిలో 80% మార్కులు సాధించింది. యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు, వారి నేపథ్యం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా కృషి, అంకితభావం, పట్టుదలతో కోరుకున్నది సాధించగలరని దివ్య నమ్ముతుంది. ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఇతరులకు సరైన తోడ్పాటు అందించడమే తన లక్ష్యమని దివ్య చెప్పింది.
0 Comments:
Post a Comment