ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి.
ప్రత్యేక సంస్కృతి, చరిత్ర, జీవన విధానాల్లో వేటికవే ప్రత్యేకం. కొన్ని దేశాల్లో వందల కోట్ల జనాభా ఉంటే, మరికొన్ని దేశాల్లో అతి తక్కువ మంది జనాభా నివసిస్తున్నారు. వేల సంఖ్యలో జనాభా ఉన్న దేశాలు ఉన్నాయంటే నమ్మడం కూడా కష్టమే. ప్రస్తుతం 142.86 కోట్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. అయితే ఇప్పుడు అతి తక్కువ మంది జనాభా ఉన్న దేశాల వివరాలు పరిశీలిద్దాం.
డొమినికా : కరేబియన్‌లో ఉన్న ఒక ద్వీప దేశం డొమినికా. ఇక్కడ కేవలం 73,000 మంది జనాభా నివసిస్తున్నారు. 751 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దేశం దాని వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి చెందింది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ : వెనిజులాకు ఉత్తరాన ఉన్న ఒక చిన్న కరేబియన్ దేశం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. ఈ దేశంలో కేవలం 48,000 కంటే తక్కువ జనాభా ఉన్నారు. 261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతంలోని అతి చిన్న దేశాలలో ఇది ఒకటి.
మార్షల్ ఐలాండ్స్ : పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం మార్షల్ ఐలాండ్స్. కేవలం 42,000 కంటే తక్కువ జనాభా ఉన్నారు. 29 పగడపు అటాల్స్, 5 ద్వీపాలతో రూపొందింది. జనాభాలో సగం మంది రాజధాని నగరం మజురోలో నివసిస్తున్నారు.
లిచ్టెన్‌స్టెయిన్ : మధ్య ఐరోపాలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న ఒక చిన్న దేశం లిచ్టెన్‌స్టెయిన్ . కేవలం 40,000 కంటే తక్కువ జనాభా ఉన్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, ఇది ఐరోపాలోని అతి చిన్న దేశాలలో ఒకటి.
మొనాకో : పశ్చిమ ఐరోపాలోని ఒక చిన్న దేశం మొనాకో. విలాసవంతమైన జీవనశైలి, అధిక సంఖ్యలో లక్షాధికారులు ఉన్న దేశం. కేవలం 36,000 మంది జనాభాతో, ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటిగా ఉంది.
శాన్ మారినో : ఐరోపాలో..శాన్ మారినో 33,642 మంది జనాభాతో ఒక చిన్న దేశం. 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ క్రీ.శ. 300 సమయంలో కొండపై చర్చి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇది 1862లో స్వాతంత్ర్యం పొందింది. ఇప్పుడు తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధికి ప్రసిద్ధి చెందింది.
పలావు : పసిఫిక్ దీవులలో ఉన్న ప్రాంతం పలావు. ఇందులో 18,058 మంది జనాభా నివసిస్తున్నారు. దీని విస్తీర్ణం 459 చదరపు కిలోమీటర్లు. 1994లో స్వతంత్ర దేశంగా అవతరించే ముందు 1914-1944 వరకు జపనీస్ పాలనలో ఉంది. పలావు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ద్వీపాలకు ప్రసిద్ధి చెందింది.
నౌరు : నౌరు, 12,780 మంది జనాభా కలిగిన చిన్న ద్వీప దేశం, 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఫాస్ఫేట్ తవ్వకాల కారణంగా దాని భూమిలో 80% పైగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయితే నౌరు ప్రజలు వ్యవసాయంలో నిమగ్నమై పైనాపిల్, అరటి, కొబ్బరి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ ద్వీపానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ 3,000 సంవత్సరాల నుంచి మానవులు నివసిస్తున్నారు.
టువాలు : హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఒక చిన్న ద్వీప దేశం టువాలు. కేవలం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని జనాభా 11,396. సముద్ర మట్టాలు పెరగడం వల్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది. టువాలు ప్రజలు క్రికెట్ లాంటి 'కిలికిటి' ఆటతో సహా వారి సాంప్రదాయ జీవన విధానాలను అనుసరిస్తూనే ఉన్నారు. టువాలులో కొబ్బరి ఆధారిత వంటకాలు ప్రసిద్ధి చెందాయి. ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక విలువ ఇస్తారు.
వాటికన్ సిటీ : వాటికన్ సిటీ, ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఒక చదరపు కిలోమీటరు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కేవలం 518 మంది జనాభా నివసిస్తున్నారు. కాథలిక్ చర్చి కేంద్రంగా, దీనిని పోప్ నగరంగా పిలుస్తారు. సిస్టీన్ చాపెల్, సెయింట్ పీటర్స్ బసిలికా వంటి ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలకు నిలయంగా ఉంది.
0 Comments:
Post a Comment