ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించింది.
వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు చేయలేదు. మునుపటి వడ్డీ రేట్లు యధాతధంగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సి), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సిఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపి), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సవరణలు చేస్తుంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో మార్పులు చేసింది. సవరించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంపై 7 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి 7.7 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచగా, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై వడ్డీని 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెంచారు.
ఇక పెట్టుబడి మొత్తానికి రెట్టింపు ఆదాయాన్ని ఇచ్చే కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడంతో పాటు, మెచ్యూరిటీ కాలాన్ని 120 నుంచి 115నెలలకు తగ్గించారు.
ఏడాది కాలపరిమితితో డిపాజిట్ వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేళ్ల డిపాజిట్ వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, మూడేళ్లు డిపాజిట్‌కు 6.9 శాతం నుంచి 7 శాతానికి, ఐదేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్ల వడ్డీరేటును 7 శాతం నుంచి 7.5 శాతం పెంచారు. ఇక ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెంచారు.
ఇక ఆడపిల్లల పాలిట బంగారంలా నిలుస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రస్తుతం 7.6శాతం వడ్డీ ఇస్తుండగా, ఏప్రిల్ 1 నుంచి 8.0శాతం ఇవ్వనున్నారు. ఈ కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అయితే, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు ఆర్థిక శాఖ. మునుపటి రేట్లు యధాతధంగా కొనసాగనున్నాయి.
0 Comments:
Post a Comment