మనిషి జీవితంలో తండ్రి స్థానం చాలా గొప్పది.
ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. జ్యోతిష్యశాస్త్రంలో కూడా తండ్రి స్థానానికి ఎంతో ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి తండ్రికి కారకుడు. అంటే పితృ కారకుడు అన్నమాట.
పైగా 9వ స్థానం అంటే భాగ్యస్థానమే తండ్రి స్థానం కూడా. అందువల్ల తండ్రికి, భాగ్యానికి లంకె ఉందని అర్థం చేసుకోవాలి. జాతక చక్రంలో పితృ కారకుడు, పితృ స్థానాధిపతి, పితృస్థానం బలహీనంగా ఉన్నట్టయితే తండ్రి చిన్నతనంలోనే మరణించడం గానీ, దూరం కావడం కానీ లేదా తండ్రికి శత్రుత్వం ఏర్పడడం గానీ జరుగుతుంది.
దీనినే పితృ దోషం అంటారు. పితృ కారకుడు, పితృ స్థానాధిపతి పితృ స్థానం బలంగా ఉన్న పక్షంలో తండ్రితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. తండ్రి వల్ల ఎంతగానో ప్రయోజనం పొందుతారు. వృద్ధాప్యంలో తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటారు.
రవి అతి ముఖ్యం : పితృ కారకుడైన రవి జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో ఉన్నా లేక దుస్థానాలలో ఉన్నా.. ఆ జాతకుడికి తప్పకుండా పితృ దోషం ఉంటుంది. పితృ దోషం ఉన్న జాతకులకు జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగానే ఉంటాయనీ, తరచూ దురదృష్టాలు తలుపు తడుతూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇటువంటి జాతకులు తండ్రి ప్రేమకు ఏదో ఒక కారణం మీద దూరం అవుతారు. తండ్రి అండదండలను కోల్పోతారు. దీనివల్ల జీవిత ప్రాథమిక దశ దెబ్బతిని మిగిలిన జీవితకాలమంతా సమస్యలు పోరాటాలతో గడపవలసి వస్తుంది.
పితృ స్థానం, దాని అధిపతి : జాతక చక్రంలో 9వ స్థానం పితృ స్థానం. ఈ స్థానంలో పాప గ్రహాలు ఉండటం తండ్రికి మంచిది కాదు. ఈ స్థానంలో శుభగ్రహాలు ఉండటం వల్ల తండ్రికి యోగం పడుతుంది. ఆ యోగ ప్రభావం తప్పకుండా పిల్లల మీద కూడా ఉంటుంది.
జాతక చక్రంలో 9వ స్థానంలో కుజుడు, శని, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు ఉండటం తండ్రికి తీరని కష్టనష్టాలు తెచ్చి పెడతాయి. జాతకులకు కూడా పితృ సౌఖ్యం దూరం అవుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, తొమ్మిదో స్థానంలో ఉన్న పక్షంలో తండ్రికి శుభ యోగాలు, అదృష్ట యోగాలు పట్టి ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధిలోకి వస్తుంది.
అదేవిధంగా పితృ స్థానాధిపతి 6, 8 ,12 స్థానాలలో ఉన్న పక్షంలో తండ్రితో శత్రుత్వం ఏర్పడటం, తండ్రి వల్ల ఉపయోగం లేకపోవడం, తండ్రి చిన్నతనంలోనే దూరం కావడం వంటివి జరుగుతాయి.
పితృ భాగ్య యోగం : జాతక చక్రంలో పితృ కారకుడు అయిన రవి, పితృ స్థానాధిపతి, పితృ స్థానం సరిగ్గా ఉన్న పక్షంలో అటువంటి జాతకుడికి తప్పకుండా పితృభాగ్య యోగం పడుతుంది.
సరైన చదువు చెప్పించడం, సరైన విధంగా కెరీర్‌ను ప్లాన్ చేయటం, పిల్లల భవిష్యత్తును అన్ని విధాలుగాను తీర్చిదిద్దటం, పిల్లలకు ఆస్తిపాస్తులు సమకూర్చి పెట్టడం, జీవితాంతం పిల్లలకు అండగా ఉండటం వంటివి ఈ యోగం వల్ల చోటు చేసుకుంటాయి.
ఇక జాతక చక్రంలో పితృ దోషం ఏర్పడితే, తండ్రి వల్ల పిల్లలకు, పిల్లల వల్ల తండ్రికి కష్టనష్టాలు తప్ప ఉపయోగం ఉండకపోవచ్చు. పితృ స్థానం, పితృ స్థానాధిపతి కంటే రవి బలంగా ఉండటం వల్ల పితృ దోషం కొట్టుకుపోతుంది.
జాతక చక్రంలో రవి బలంగా ఉన్న జాతకులు జీవితంలో అనేక అదృష్టాలను పండించుకోవడంతోపాటు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
పితృ దోష పరిహారాలు : జాతక చక్రంలో పితృ దోషం ఉన్నవారు తప్పనిసరిగా ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. తండ్రి పేరిట తరచూ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన లేదా పూజ చేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సుందరకాండ పారాయణం చేసినా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. పుష్యరాగం పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల కూడా తండ్రితో సత్సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
0 Comments:
Post a Comment