Pets: అపార్ట్‌మెంట్స్‌లో కుక్కల గొడవ- పెట్ ఓనర్స్‌కు ఉన్న హక్కులేంటి..? అసోసియేషన్లకు ఉన్న బాధ్యతలేంటి..?
కుక్కలు...బాబోయ్ కుక్కలు… విశ్వాసానికి పెట్టింది పేరైన శునకాలు.. గత కొద్ది రోజులుగా జనాల్ని వణికిస్తున్నాయి. ఆ ఊరు.. ఈ ఊరు అని లేదు… వీధుల్లోనా.. అపార్మెంట్లలోనా.. అసోసియేషన్లోనా అని కూడా లేదు… ఎక్కడ చూసినా ఇప్పుడు కుక్కల గొడవే. కొన్ని సార్లు కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం, మరి కొన్ని సార్లు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలో ఈ మధ్య కాలంలో రోజూ జరుగుతూ ఉండటంతో కుక్కల పేరెత్తినే జనం హడలిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో వీధి కుక్కలకు ఓ చిన్నారి బలి కాగా… ఆ తర్వాత అపార్మెంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బోయ్… కుక్కల ధాటికి భయపడి అపార్టమెంట్ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఏపీలోని జగ్గంపేటలో పిచ్చి కుక్కల స్వైర విహారంతో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీటన్నింటికీ మించి ఇటీవల అపార్టమెంట్లలో పెంపుడు కుక్కల విషయంలోనూ తీవ్ర అభ్యంతరాలు తలెత్తతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో మంజీరా హైట్స్ అపార్ట్మెంట్లో ఓ పోలీస్ అధికారి పెంచుకుంటున్న కుక్కల విషయంలో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. వారి గొడవ మీడియా వరకు రావడం… అడిగితే సీఐ బెదిరిస్తున్నారంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేయడం.. చివరకు జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకోవడం… ఇలా పెద్ద రచ్చే జరిగింది. అసలు ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికుల పరిస్థితి ఏంటి..? అపార్ట్మెంట్లలో, అసోసియేషన్లలలో ఉండే వారు కుక్కలను పెంచుకోకూడదా… అసలు ఈ విషయంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా… ఉంటే అసలు ఆ రూల్స్ ఏంటి..? ఆ రూల్స్ పాటిస్తే… శునక ప్రేమికులకు చిక్కులు తొలగినట్టేనా… ఇప్పుడు ఓ సారి చూద్దాం.
ముఖ్యంగా హైదరాబాద్ వాసులెవ్వరైనా సరే… కచ్చితంగా తమ పెంపుడు జంతువుల్ని జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేయించుకొని లైసెన్స్ తీసుకోవాలి. ఒక వేళ ఇప్పటికే రిజిస్టర్ చేయించుకొని ఉంటే.. వెంటనే సంబంధిత అధికారులకు యాంటి రాబిస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అలాగే పెట్ ఓనర్స్ ఇరుగుపొరుగున ఉన్న కనీసం ముగ్గురు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ అధికారులకు సమర్పించాలి. అలా రిజిస్టర్ చేయించుకున్న పెట్ ఓనర్లకు జీహెచ్ఎంసీ ప్రత్యేకమైన ట్యాగ్స్ జారీ చేస్తుంది.
* 2020 మే 29న జీహెచ్ఎంసీ జారీ చేసిన జీఓ ప్రకారం మీ పెంపుడు జంతువుల్ని ఎప్పుడు ఒక్కదాన్నే విడిచిపెట్టకూడదు, బయటకి తీసుకొచ్చిన ప్రతి సారి దాని యజమాని కచ్చితంగా ఉండాలి. అలాగే పిల్లలతో వాటిని బయటకు పంపకూడదు.
* పెంపుడు జంతువుల కోసం కచ్చితంగా సర్వీస్ లిఫ్ట్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఒక వేళ అనివార్య కారణాల వల్ల ఆ లిఫ్ట్ పని చేయకపోయినా, వేరొకరి ఉపయోగంలో ఉన్నా.. దానికి దగ్గర్లో ఉన్న లిఫ్ట్‌ను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే. ఫస్ట్ ఛాయిస్ మాత్రం సర్వీస్ లిఫ్ట్ అన్న విషయాన్ని యజమానులు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక వేళ సర్వీస్ లిఫ్ట్ ప్రత్యేకంగా లేనప్పుడు ముందుగానే మీ పెట్స్ విషయాన్ని అసోసియేషన్‌తో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.
* పెంపుడు జంతువుల్ని లాన్స్‌లోకి, చిల్డ్రన్ ప్లే ఏరియాలోకి, అలాగే వాకింగ్ ట్రాక్స్‌పైకి, సెంట్రల్ పార్క్, స్విమ్మింగ్ పూల్స్ సమీపంలో, ఫుడ్ కోర్ట్స్, క్లబ్ హౌజ్ సమీపంలోకి అనుమతి ఉండదు. ఆ విషయంలో యజమానులు పూర్తి పరిజ్ఞానంతో ఉండటం చాలా అవసరం.
*ఒక వేళ మీ పెట్స్.. ఎక్కడైనా చెత్త చేస్తే.. దాన్ని శుభ్రం చేయించాల్సిన బాధ్యత పెట్ ఓనర్స్‌ది మాత్రమే. ఇది కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం
*అలాగే పెట్స్‌ను బయటకు తీసుకొచ్చే సమయాలు కూడా కొన్ని అసోసియేషన్స్ ప్రత్యేకంగా సూచిస్తాయి. ఆ సమయాలను కచ్చితంగా పాటించాలి. సాధారణంగా ఉదయం 6 నుంచి 8 వరకు అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉంటూ ఉంటాయి. ఏదైనా ఇది వారి వారి అసోసియేషన్ లేదా కమిటీల నిర్ణయాను సారం ఈ సమయాల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు.
అయితే అన్నీ అధికారాలు కేవలం అసోసియేన్లకు, కమిటీలకేనా.. అంటే పెట్స్ పెంచుకోవాలా.. వద్దా అన్న విషయం వాళ్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందేనా… అంటే అది కూడా కాదు.. పెట్ ఓనర్స్‌కి కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు, అధికారాలు ఉంటాయి.
* అసలు ఏ అసోయేషన్ లేదా అపార్ట్మెంట్ అయినా పెంపుడు జంతువుల్ని నిషేధించడానికి లేదు. సెక్షన్ 9-K ప్రివెన్షన్ ఆఫ్ క్రూయిల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం హౌసింగ్ సొసైటీలు తమ బైలాస్‌లో పెంపుడు జంతువుల్ని అనుమతించడం అని చెప్పడానికి లేనే లేదు. ఒక వేళ మెజార్టీ అసోషియనే మెంబర్లు పెట్స్‌ను అనుమతించడానికి లేదని చెప్పినా సరే… అది కుదరదు. ఆర్టికల్ 51-A ప్రకారం జంతువుల పట్ల, ఇతర జీవుల పట్ల దయా దాక్షిణ్యాలు చూపడం ప్రతి పౌరుని బాధ్యత.
*జంతువులను బట్టి, వాటి జాతిని బట్టి అసోషియేన్లు వాటిని నిషేధించడానికి లేదు. ఉదాహరణకు కుక్కల విషయానికే వస్తే వాటి బ్రీడ్ బట్టి… బ్యాన్ చేస్తామంటే కుదరదు. అంతే కాదు.. కుక్కలు అరుస్తూ ఉన్నాయని చెప్పి కూడా వాటిని అసోసియేన్లలలో బ్యాన్ చెయ్యడానికి లేదు.
* కామన్ ఏరియాల్లోకి పెట్స్‌ను అనుమతించడం అనడానికి ఏ అసోసియేషన్‌కు రైట్ లేదు. అయితే వాటి కోసం కొన్ని ప్రత్యేక సమయాలను సూచించవచ్చు. సదరు పెట్ ఓనర్ వాటిని పాటించి తీరాల్సిందే.
*పెంపుడు జంతువుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరంగా ప్రవర్తించకూడదు. అది నేరం కూడా.
* అలాగని పెట్ ఓనర్ ఏం జంతువుని పడితే ఆ జంతువుల్ని ట్రైన్ చెయ్యడం లేదా పెంచడం కూడా చెయ్యకూడదు. అంటే చిలుకలు, కోతులు వంటి వాటికి శిక్షణ ఇచ్చి వాటిని వినోదానికి ఉపయోగించడం కూడా నేరమే.
* అసోసియేషన్లు పెట్స్ కోసం ప్రత్యేకమైన టైం స్లాట్లు కేటాయించాలి.
* ఎప్పుడైనా అసోసియేషన్ మేనేజ్మెంట్.. పెంపుడు జంతువుల యజమానుల్ని వాటి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ రికార్డ్స్‌ను అడగవచ్చు.
*అలాగే పెట్ ఓనర్స్ వాటిని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లి తిరిగి అసోసియేషన్లోకి తీసుకొచ్చేటప్పుడు వాటిని శుభ్రం చేయించడమని అడిగే హక్కు కూడా అసోసియేషన్‌కి ఉంది.
*ముందే చెప్పినట్టు ఓనర్ లేకుండా ఏ పెంపుడు జంతువు బయటకు రాకూడదు.
* అవసరమైతే అసోసియేషన్లు జంతు సంరక్షణ సంస్థల సాయంతో తమ అసోసియేషన్ మెంబర్లకు ఎప్పటికప్పుడు పెంపుడు జంతువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు ఇప్పించవచ్చు.
*నిషేధిత ప్రాంతాల్లో పెంపుడు జంతువులకు ఫీడింగ్ చెయ్యకూడదనే హక్కు అసోసియేషన్లకు ఉంటుంది.
*ప్రతి అసోసియేషన్, లేదా గేటెడ్ కమ్యూనిటీలలో పెట్ ఓనర్స కోసం ప్రత్యేకంగా రూల్స్, అండ్ రెగ్యూలేషన్స్ ఏర్పాటు చేసి వాటి పట్ల వారికి పూర్తి అవగాహన కల్గించాలి.
*అలాగే ప్రతి పెట్ ఓనర్… ఈ విషయంలో నూటికి నూరు శాతం బాధ్యతగా ఉండాలి. మీ పెంపుడు జంతువులకు, లేదా పక్షులకు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేయించాలి. వాటి వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కామన్ ఏరియాలను వాడే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం మీరు పెంచుకునే జంతువులకు మీ చుట్టుపక్కల వారిని వీలైనంతగా అలవాటు చెయ్యాలి. సాధారణంగా కొత్త వాళ్లు అపార్టమెంట్లకు, అసోసియేన్లకు వస్తుండటం పరిపాటి. అలాంటి సమయాల్లో మీ పెట్స్ వారిపై దాడి చెయ్యకుండా తగిన శిక్షణ ఇవ్వాలి. లేదంటే అదింత మరింత న్యూసెన్స్‌కి కారణం అవుతుంది. ఒక వేళ మీ పెట్ పూర్తి శిక్షణ పొందినప్పటికీ అది కచ్చితంగా మీ పర్యవేక్షణలోనే ఉండాలి.
మీరు ఓ పెట్ ఓనర్‌గా పూర్తి బాధ్యతగా ఉండాలి. అప్పుడే చుట్టుపక్కల వారి నుంచి మీకు సమస్యలు లేకుండా ఉంటాయి.
ఇక వీధి కుక్కలు, ఊర కుక్కల విషయంలో ఈ రూల్స్ వర్తించవు, వాటి పర్యవేక్షణ, వాటి నియంత్రణ అన్నది సంబంధిత అధికారిక విభాగం పరిధిలోనే ఉంటుంది.
0 Comments:
Post a Comment