Password: పాస్‌వర్డ్‌లను నిమిషం కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేస్తున్న AI.. ఇలా సేఫ్‌గా ఉండండి
Password: ప్రస్తుతం యావత్ టెక్నాలజీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వైపు చూస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోంది.
AI ప్రతికూల ప్రభావాల గురించి కొంతమంది ఆందోళన చెందుతుండగా, మరికొందరు దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి సంతోషిస్తున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీపై దీని ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. మనం సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను AI ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయగలదని ఓ తాజా అధ్యయనం కనుగొంది. అంటే యూజర్ల పాస్‌వర్డ్‌లు వారు అనుకున్నంత సురక్షితంగా లేవు. తమ ఆన్‌లైన్ అకౌంట్‌లను రక్షించుకోవడానికి అదనపు చర్యలు తీసుకోక తప్పదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో సగానికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా నిమిషం కంటే తక్కువ వ్యవధిలో సులభంగా తెలుసుకోవచ్చని హోమ్ సెక్యూరిటీ హీరోస్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 15,680,000 పాస్‌వర్డ్‌ల లిస్ట్‌ను టెస్ట్ చేయడానికి PassGAN అనే AI పాస్‌వర్డ్ క్రాకర్‌ను ఉపయోగించారు. దాదాపు 51 శాతం సాధారణ పాస్‌వర్డ్‌లను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయవచ్చని, 65 శాతం పాస్‌వర్డ్‌లను గంటలోపే క్రాక్ చేయవచ్చని గుర్తించారు. అంతేకాకుండా ఒక నెలలో 81 శాతం పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయవచ్చని అధ్యయనం వెల్లడించింది.
AI నిజానికి పాస్‌వర్డ్‌ను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేస్తుందంటే.. చాలా చిన్న పాస్‌వర్డ్‌లు సెట్ చేసుకుని ఉంటేనే జరుగుతుంది. ఉదాహరణకు ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వంటివి ఉపయోగిస్తే సులువుగా పాస్‌వర్డ్‌ని ఊహించవచ్చు. అదే అక్షరాలు, నంబర్లు, సింబల్స్ కలయికతో 18 అక్షరాల పొడవు ఉంటే పాస్‌వర్డ్ పెట్టుకుంటే.. గుర్తించడానికి చాలా సమయం పడుతుంది.
18 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పాస్‌వర్డ్‌లు సాధారణంగా AI పాస్‌వర్డ్ క్రాకర్ల నుంచి సురక్షితంగా ఉంటాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇలాంటి పాస్‌వర్డ్‌ని క్రాక్ చేయడానికి కనీసం 10 నెలల సమయం పట్టింది. సింబల్స్, నంబర్‌లు, లెటర్స్, అప్పర్, స్మాల్ కేస్ లెటర్స్ వినియోగిస్తే పాస్‌వర్డ్‌లు మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయి. వాటిని పగులగొట్టడానికి 6 క్విన్టిలియన్(Quintillion) సంవత్సరాల వరకు పట్టవచ్చు.
* సురక్షితంగా ఉండడం ఎలా?
AI పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయకుండా రక్షించుకోవడానికి, కేవలం నంబర్‌లు లేదా సులభంగా ఊహించగలిగే పదాలతో పాస్‌వర్డ్‌లను పెట్టకూడదు. కనీసం 15 అక్షరాల పొడవు ఉండే పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. లెటర్స్, సింబల్స్, నంబర్‌లు, అప్పర్, లోయర్-కేస్ లెటర్స్ ఉండేలా చూడాలి. అంత పెద్ద పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి పాస్‌వర్డ్ మేనేజర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు. పాస్‌వర్డ్‌లో కనీసం రెండు అక్షరాలు, నంబర్లు, సింబల్స్ ఉండాలి, ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు పాస్‌వర్డ్ మార్చుకోవాలి. అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్ వినియోగించకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం.
0 Comments:
Post a Comment