Monthly budget | ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మందికి భారీ ఆశలు ఉంటాయి. కానీ.. ఆ స్థాయిలో ఖర్చు చేసే స్తోమత ఉండదు. కొన్ని పరిమితులు విధించుకొని ఆర్థికంగా ఒక్కో మెట్టు ఎక్కాల్సి ఉంటుంది.
లేదంటే జీవన పయనం అస్తవ్యస్తంగా మారుతుంది. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించాల్సిందే. అందుకు బడ్జెట్ (Monthly budget) ఒక మేలైన మార్గం. దాని ప్రకారం ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులను కట్టడి చేయొచ్చు.
ప్రతినెలా ఒక సమతుల్యమైన బడ్జెట్ (Monthly budget)ను రూపొందించుకోవాలి. తద్వారా ఖర్చులను నియంత్రించడంతో పాటు పొదుపు కూడా అనుకున్న విధంగా సాగుతుంది.
ఫలితంగా దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాలనూ చేరుకుంటారు. మరి నెలవారీ బడ్జెట్ రూపకల్పనలో ఉపయోగపడే 10 టిప్స్ చూద్దాం..
మీ ఆదాయం ఎంత: బడ్జెట్ (Monthly budget) రూపకల్పనను మీ ఆదాయం లెక్కించడంతోనే ప్రారంభించాలి. వేతనం, అదనపు ఆదాయం, పెట్టుబడుల నుంచి వచ్చే రాబడులు సహా ఎలాంటి ఆదాయం ఉన్నా.. దీంట్లో చేర్చాలి.
ఖర్చుల అంచనా: ఒక నెలలో మీకు అయ్యే ఖర్చులన్నింటినీ ఒక దగ్గర రాసిపెట్టుకోండి. తద్వారా మీ అవసరాలకు నెలకు ఎంత డబ్బు అవసరమో అంచనాకు రావొచ్చు.
అలాగే మీ డబ్బు ఎలా ఖర్చవుతుందో కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫలితంగా ఎక్కడైనా అనవసరంగా ఖర్చు చేస్తున్నామనుకుంటే దాన్ని నివారించేందుకు అవకాశం లభిస్తుంది.
ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: ఆ నెలలో మీరు సాధించాలనుకుంటున్న ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు విహారయాత్రకు కావాల్సిన డబ్బును పక్కకు పెట్టడం, రుణ చెల్లింపు, ఎమర్జెన్సీ అవసరాల కోసం కొంత సొమ్మును పక్కకు తీసి పెట్టడం వంటివన్నీ ఆర్థిక లక్ష్యాల్లో భాగమే.
ఖర్చుల ప్రాధాన్య క్రమం: ఒక నెలలో మీకు రాబోయే ఖర్చులన్నింటినీ అంచనా వేసిన తర్వాత.. వాటిని అవసరాలు, కోరికల కింద విభజించాలి.
ముందుగా అద్దె, బిల్లులు, భోజనం వంటి అత్యవసర ఖర్చులకు డబ్బు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇతర ఖర్చులకు ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేయాలి.
బడ్జెట్ ప్లాన్: పైవన్నీ పూర్తయిన తర్వాత ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఒక సమతుల బడ్జెట్ (Monthly budget) ప్రణాళికను రచించుకోవాలి.
డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. దాంట్లో నుంచి దేనికి ఎంత ఖర్చు చేయాలి వంటి విషయాలను స్పష్టంగా రాయాలి. వీలైతే.. భోజనం, అద్దె, ప్రయాణాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా కేటగిరీలుగా విభజించుకోవాలి.
ఖర్చులను తగ్గించుకోవాలి: ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట తినడాన్ని తగ్గించడం, బిల్ల్లు చెల్లింపుల విషయంలో వీలుంటే బేరసారాలకు వెళ్లడం, అంతగా ఉపయోగించని వస్తువులను కొనాల్సిన అవసరం ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యం ఇవ్వడం, రాయితీలు, ప్రోమో కోడ్‌ల వంటి వాటిని వినియోగించుకోవడం చేయాలి.
నగదు లేదా డెబిట్ కార్డ్: ఖర్చులు నియంత్రణలో ఉండాలంటే నేరుగా నగదునే వాడాలి. లేదా డెబిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డుపై ఎక్కువగా ఆధారపడితే.. ఖర్చులపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. ఆఖరికి అది ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది.
పొదుపు మరవొద్దు: ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కకు తీసిపెట్టుకోవాలి. చిన్న మొత్తమైనా సరే దీర్ఘకాలం కొనసాగిస్తే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టొచ్చు.
బడ్జెట్‌ను సమీక్షించాలి: కొత్త బడ్జెట్ (Monthly budget)ను రూపొందించుకునే ముందు.. క్రితం నెల బడ్జెట్‌ను క్షుణ్నంగా సమీక్షించాలి. ఎక్కడ అధికంగా ఖర్చు చేశారు? ఎక్కడ గాడి తప్పారో గమనించాలి. అందుకు అనుగుణంగా కొత్త బడ్జెట్‌లో మార్పులు చేసుకోవాలి.
బడ్జెట్‌కు కట్టుబడాలి: మరీ అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్ (Monthly budget) నుంచి దారి తప్పొద్దు. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకొని.. ముందుకు సాగితేనే ఖర్చులను నియంత్రించి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. తద్వారా భవిష్యత్ ఇబ్బందులను నివారించుకోగలుగుతారు.
ఇదంతా కొంత సమయం తీసుకునే అంశమే. పైగా చాలా మందికి ఇదంతా చేయడానికి బద్ధకంగా కూడా అనిపించొచ్చు. అలాగే ప్రతినెలా ఇంత కసరత్తు చేయాలంటే కొంత మానసిక శ్రమ తప్పదు.
కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలంటే మాత్రం బడ్జెట్ (Monthly budget) రూపకల్పన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
0 Comments:
Post a Comment