KVP Ramachandra Rao
వైఎస్ జగన్ విషయాలన్నీ త్వరలో బయటపెడతా- కేవీపీ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రాగల శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
మరోసారి మీడియా ముందుకు..
ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇవ్వాళ విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో మాట్లాడారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల పాటు రాహుల్ గాంధీకి గడువు ఇచ్చినప్పటికీ సూరత్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చిన రెండో రోజే అనర్హత వేటు వేసిందని గుర్తు చేశారు.
బీసీలను కించపర్చినట్లా..
ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని చెప్పారు. అనర్హత వేటు వేసిన వెంటనే- అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్ గాంధీకి నోటీసులను జారీ చేసిందని, ఇంతకుమించిన నియంతృత్వ వైఖరి ఉండబోదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటిపేరుతో విమర్శించడం.. దేశంలో గల కోట్లాదిమంది వెనుకబడిన సామాజిక వర్గాలను ఎలా కించపర్చినట్టవుతుందో అర్థం కావట్లేదని కేవీపీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా?
ఒక పార్లమెంట్ సభ్యుడిపై అనర్హత వేటు వేయాలంటే- దానికి రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్రపతి భవన్ జారీ చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం రాష్ట్రపతిని సంప్రదించినట్లు కూడా సమాచారం లేదని అన్నారు. స్వాతంత్ర్యానంతరం ఆధునిక భారతదేశాన్ని నిర్మించింది గాంధీ-నెహ్రూల కుటుంబమేనని, వేల పరిశ్రమల, భారీ నీటి పారుదల ప్రాజెక్టులతో దేశాన్ని సస్యశ్యామలం చేసిందని అన్నారు.
నెహ్రూ పార్లమెంట్ ప్రసంగాల రికార్డులు తొలగింపు..
ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం ఆ పరిశ్రమలన్నింటినీ తెగనమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. దేశ ప్రప్రథమ ప్రధానిగా కొన్ని సంవత్సరాల పాటు పార్లమెంట్ లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాలన్నింటినీ రికార్డుల నుంచి తొలగించారని కేవీపీ ఆరోపించారు. నెహ్రూ కుటుంబానికి దేశ రాజధానిలో ఇళ్లు కూడా లేదని పేర్కొన్నారు. గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు వెళ్లే ఆదాయంలో అధికమొత్తంలో వాటాలు ప్రధాని మోదీ, బీజేపీకి వెళ్తోందని విమర్శించారు.
అదాని ఆదాయం ఎలా పెరిగింది?
కరోనా వైరస్ వంటి పరిస్థితుల్లోనూ అదాని ఆదాయం ఎలా పెరిగిందని కేవీపీ ప్రశ్నించారు. అదే సమయంలో దేశంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. దీన్ని నివారించడానికి పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిందని పేర్కొన్నారు. వాటన్నింటినీ హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టిందని, అదాని అక్రమాల గురించి ప్రశ్నిస్తోండటం వల్లే రాహుల్ గాంధీపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు.
ఎవ్వరైనా ప్రశ్నించారా?
ఏపీలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారని, రాహుల్ గాంధీ అనర్హతను వారు ఎందుకు ప్రశ్నించట్లేదని చెప్పారు. అటు తెలుగుదేశం సభ్యులు సైతం ఈ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ గల అంతర్గత, చీకటి ఒప్పందాలు ఏమున్నాయో తనకు తెలియట్లేదని, కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో వైసీపీ జంకుతోందని అన్నారు.
జగన్ కు దూరం కావడంపై..
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న తాను ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే విషయాన్ని త్వరలోనే బయటపెడతానని కేవీపీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని వివరించారు. వైఎస్సార్ స్నేహానికి, కుటుంబ బాంధవ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన ఓ గొప్ప రాజనీతిజ్ఞుడని వ్యాఖ్యానించారు.
0 Comments:
Post a Comment