కర్నాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అధికార బీజేపీకీ, విపక్ష కాంగ్రెస్ కు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మూడో పార్టీ జేడీఎస్ కూడా మరోసారి కింగ్ మేకర్ గా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు సర్వే సంస్ధలు అభిప్రాయ సేకరణలు చేస్తున్నాయి. ఇందులో దాదాపుగా క్లియర్ పిక్చర్ వచ్చేస్తోంది.
ఇప్పటికే ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఘన విజయంసాధించబోతున్నట్లు తేలిపోయింది. అధికార బీజేపీకి ఈ ఎన్నికలు షాకివ్వబోతున్నట్లు సీ ఓటర్ తాజా సర్వేలో తేల్చిచెప్పేసింది. ఇప్పుడు మరో సర్వే కూడా వెలువడింది. గత రెండు నెలలుగా వరుసగా రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితుల ఆధారంగా సర్వేలు నిర్వహిస్తున్న లోక్ పోల్ సంస్ధ తాజాగా తమ ఫలితాలు వెల్లడించింది.
లోక్ పోల్ సర్వే 2.0 పేరుతో తాజాగా ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు తేలింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేర్వేరుగా నిర్వహించిన ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం ఇక్కడ మరో విశేషం. అధికార బీజేపీ తన స్ధానాల సంఖ్యను ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో మరింత కోల్పోయింది. అలాగే జేడీఎస్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుందన్న అంచనాలు కూడా తారుమారయ్యేలా ఉన్నాయి.
లోక్ పోల్ సర్వే 2.0లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య ఫిబ్రవరి నాటికి 116 నుంచి 122గా నమోదు కాగా.. అది మార్చి నాటికి 128 నుంచి 131కి పెరిగింది. దీంతో పాటే దాదాపు మూడుశాతం ఓటు షేర్ కూడా కాంగ్రెస్ పార్టీ పెంచుకుంది. అలాగే బీజేపీకి ఫిబ్రవరిలో 77 నుంచి 83 సీట్లు వస్తాయని పేర్కొనగా.. మార్చిలో అవి కాస్తా 66-69కి పడిపోయాయి. ఓటు బ్యాంకులోనూ మూడు శాతం తరుగుదల నమోదైంది. జేడీఎస్ కు ఫిబ్రవరిలో 21 నుంచి 27 వస్తాయని అంచనా వేయగా.. మార్చిలో మాత్రం 21 నుంచి 25 సీట్లు వస్తాయనే అంచనా వెలువడింది. ఇతరుల సీట్లు ఫిబ్రవరిలో 1-4గా అంచనా వేస్తే మార్చిలో 0-2కు పడిపోయింది.
0 Comments:
Post a Comment