Kambu Dosa Recipe: ఈ మిల్లెట్ దోశను ఎప్పుడైన టేస్ట్ చేశారా? అదిరే రుచితో పాటు ఆరోగ్యం.. ఓ సారి ట్రై చేయండి..
ఇటీవల కాలంలో మిల్లెట్స్ ని అందరూ ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో మిల్లెట్స్ కు ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది వాటిని అల్పాహారంలా తీసుకుంటుండగా, మరికొందరూ రైస్ స్థానంలో మిల్లెట్స్ నే తీసుకుంటున్నారు.
అయితే ఎక్కువ మంది అల్పాహారంలా తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా ఉదయం సమయంలో మిల్లెట్స్ ను టిఫిన్ లా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అది కూడా మీకు ఎంతో ఇష్టమైన దోశ రూపంలో తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది పూర్తిగా చదివేయండి..
అధిక ప్రోటీన్లు..
మిల్లెట్ దోశలో తృణధాన్యాలను ఉపయోగిస్తాం. వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్, పిండి పదార్థాలు, ఖనిజాలు, ఐరన్ వంటి పోషకాలతో పాటు ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజూ ఇలాంటి మిల్లెట్ దోశ చేసుకోని తింటే రోజంతా మంచి శక్తి లభిస్తుంది. ఇవి పసిపిల్లలతో సహా అన్ని వయసుల వారికి మంచివి. మరి మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ చూడండి. ఇక్కడ అందించిన సూచనల ప్రకారం మిల్లెట్ దోశను సులభంగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ లో చాలా రకాలు ఉన్నాయి గానీ ఈ రోజు పెరల్ మిల్లెట్ దోశ లేదా కంబు దోశ, లేదా బాజ్రా (సజ్జలు)తో దోశను ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం..
ఎలా చేయాలంటే..
పెరల్ మిల్లెట్స్, మినపప్పు, బియ్యం సమాన మోతాదులో తీసుకోవాలి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో బియ్యం, మిల్లెట్లు వేసి కనీసం మూడుసార్లు బాగా కడగాలి. మరొక గిన్నెలో మినపపప్పును తీసుకొని బాగా కడగాలి. ఇప్పుడు ఈ రెండింటి సుమారు 4 గంటలు నానబెట్టండి. బియ్యం, మిల్లెట్లు ఒక గిన్నెలో, మినపపప్పు వేరొక గిన్నెలో నానబెట్టాలి. నానబెట్టిన అనంతరం వీటిని గ్రెండర్లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ మెత్తటి పిండిలను అన్ని పిండిలను ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి. పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి, అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి. ఇప్పుడు దోస పెనంను వేడి చేసి , నూనె లేదా నెయ్యితో గ్రీజ్ చేసి దోశలు వేసుకోండి. నూనె చిలకరించి రెండు వైపులా దోశను కాల్చాలి. అంతే మిల్లెట్ దోశ రెడీ, మీకు నచ్చిన చట్నీతో ఎంచక్కా ఆరగించండి.
0 Comments:
Post a Comment