హైదరాబాద్లో దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. రేపే ఆవిష్కరణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం..
దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం.. నిలువెత్తు చరిత్రకు జీవం పోసిన 'విశ్వకర్మ' ఇతనే..!
దేశంలో ఎక్కడ అత్యంత భారీ స్థాయి విగ్రహం కనిపించినా.. అది చరిత్రను నిలువెత్తు సాక్ష్యంగా అనిపించినా.. అది ఆయన సృష్టే. ఆయనే మహారాష్ట్రకు చెందిన స్థపతి రాంజీ సుతార్. హైదరాబాద్‍లో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్న నేపథ్యంలో.. దాని సృష్టికర్త సుతార్ గురించిన విశేషాలు మీకోసం.
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అండేద్కర్ విగ్రహాన్ని నగరనడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఆవిష్కరించబోతున్నారు. అయితే.. చరిత్రను ఠీవీగా తలెత్తుకుని నిలబడేలా చేసిన ఈ అత్యంత భారీ విగ్రహానికి జీవం పోసింది.. 98 ఏళ్ల వయసున్న ఈ విశ్వకర్మే. మహారాష్ట్రలోని ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన స్థపతి రాంజీ సుతార్.. చేతిలో జీవం పోసుకున్న అత్యంత భారీ స్థాయి విగ్రహాల లిస్ట్ తెలిస్తే.. నోరెళ్లబెట్టకతప్పదు. ఎక్కడ చరిత్ర నిటారుగా తలెత్తుకుని.. ఠీవీగా నిలబడి చూస్తుందో.. అక్కడ స్థపతి రాంజీ సుతార్ చేతిలో జీవం పోసుకున్న విగ్రహం ఉంటుంది అనేంతగా.. ప్రసిద్ధి చెందారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించింది కూడా స్థపతి రాంజీ సుతారే. అయితే.. సుతార్ నిర్మించిన ఎన్నో విగ్రహాలు, ప్రతిమలు దేశంలోనే కాకుండా విదేశాలకు తరలివెళ్లి.. అక్కడ మన చరిత్రను తలెత్తుకునేలా చేస్తున్నాయి.
స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించి సూతారే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని సుతారే రూపొందించారు. 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని.. గుజరాత్‌లోని నర్మదా నదిపై కేవడియా కాలనీలో వడోదర నగరానికి ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో సర్దార్ సరోవర్ ఆనకట్టకు ఎదురుగా నిర్మించారు. భారతదేశంలోని 562 రాచరిక రాష్ట్రాలను ఏకం చేసి ఒకే యూనియన్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడంలో పటేల్ చూపించిన నాయకత్వానికి గుర్తుగా.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. దేశం ఎంతో గర్వంగా చెప్పుకునే చెక్కుచెదరని చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉక్కుమనిషి విగ్రహాన్ని రూపొందించి సుతార్.. తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటారు. ఈ విగ్రహాన్ని మొత్తం పూర్తి చేసేందుకు 57 నెలలు పట్టింది.
సూతార్ చేతిలో జీవం పోసుకున్న చరిత్ర..
మరోవైపు.. సుతార్ చేతితో.. 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, ఎత్తైన మహాత్మా గాంధీ ప్రతిమను కూడా నిర్మించాడు. సుతార్ చేతిలో జీవం పోసుకున్న మహాత్ముని విగ్రహాలు ఎన్నో ఇతర దేశాలకు పంపారు కూడా. ఇవే కాదు.. భారత పార్లమెంటు వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించింది కూడా సుతారే. ఆ ప్రతిమకు సంబంధించిన పెద్ద ప్రతిరూపాన్ని విధానసౌధలో కూడా ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే.. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తైన కెంపె గౌడ విగ్రహానికి రూపకర్త కూడా స్థపతి రామ్ జీ సుతారే.
రామ్ వంజీ సుతార్ 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని గొండూరు గ్రామంలోని ఓ విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు. 1952లో అతను ప్రమీలను వివాహం చేసుకున్నారు. 1999లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సుతార్‌ను సత్కరించగా.. 2016లో పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. దేశ సంస్కృతిని కాపాడటంలో సుతార్ చేసిన సేవలకు గానూ.. 2018లో ఠాగూర్ అవార్డును కూడా అందుకున్నారు.
అంబేద్కర్ విగ్రహ ప్రత్యేకతలు
ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించారు. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆ పక్కనే మ్యూజియం, సమావేశ మందిరం కూడా నిర్మించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్‌తో పాటు 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 425 మంది సిబ్బంది ఈ విగ్రహ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యమయ్యారు. విగ్రహానికి పాలీయురేథీన్ తో పాలిషింగ్ చేస్తున్నారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు అయినప్పటికీ.. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు, వెడల్పు 45 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.146 కోట్లుగా అంచనా. ఈ విగ్రహన్ని రాం జీ సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ డిజైన్ చేశారు. 2016 ఏప్రిల్ 14న ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ.. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు(2023 ఏప్రిల్ 14న) ప్రారంభం కానుంది.
0 Comments:
Post a Comment