Higher EPS pension: అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారం షురూ
యాజమాన్యాల లాగిన్‌లోకి ఉమ్మడి ఆప్షన్లు
సరైన పత్రాలుంటే అదనపు చెల్లింపులకు నోటీసులు.
వేతన జీవుల అధిక పింఛను కోసం వచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుల పరిశీలనకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గదర్శకాలు జారీ చేసింది.
గత నెలన్నర రోజులుగా ఉద్యోగులు, పింఛనుదారులు చేసిన దరఖాస్తులను తదుపరి పరిష్కారం కోసం ఈపీఎఫ్ కేంద్ర సర్వర్ నుంచి యజమాన్యాల లాగిన్‌లోకి పంపించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసిన పింఛనుదారులు తాము సర్వీసులో ఉన్నపుడు ఉమ్మడి ఆప్షన్లు ఇవ్వగా వాటిని తిరస్కరించింది. ఈ తరహా పింఛనుదారులు మే 3 వరకు దరఖాస్తు చేసేందుకు అనుమతించింది. అలాగే 2014కు ముందు సర్వీసులో చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ వాస్తవిక అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్‌ను మే 3లోగా ఇవ్వాల్సి ఉంది. గత నెలన్నర రోజులుగా చందాదారులు, పింఛనుదారులు చేసిన ఉమ్మడి ఆప్షన్లను యాజమాన్యాలు ఏ విధంగా పరిష్కరించాలో పేర్కొంటూ ఈపీఎఫ్‌వో సమగ్ర సూచనలు చేసింది. ఒకవేళ యాజమాన్యాలు దరఖాస్తులను తిరస్కరించినా, ఆమోదం తెలపకున్నా, సరైన పత్రాలు దరఖాస్తుతో పాటు సమర్పించకపోయినా క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన వైఖరిపై అంతర్గతంగా సూచనలు చేసింది.
బకాయిలు చెల్లించేందుకు, ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులో అదనపు సమాచారం కోసం నెల రోజుల గడువు ఇవ్వనుంది. ఆ గడువులోగా సమాచారం రాకుంటే ప్రాంతీయ పీఎఫ్ అధికారులు దరఖాస్తులోని సమాచారానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటుతో పాటు సరైన పత్రాలు సమర్పించిన దరఖాస్తులపై వెంటనే అదనంగా చెల్లించాల్సిన డిమాండ్ నోటీసులు చందాదారులు, యాజమాన్యాలకు జారీ చేయాలని తెలిపింది. యాజమాన్యాల లాగిన్‌లోకి వచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుల్ని యాజమాన్యాలు ఆమోదించి, ఆ దరఖాస్తులతో పాటు అవసరమైన పత్రాలు, వేతన వివరాల ఆధారాలను అందజేయాలని సూచించింది.
పత్రాలన్నీ సరిగా ఉంటే...
* యాజమాన్యాల ఆమోదం తరువాత ఈపీఎఫ్‌వో చట్టం-1952 ప్రకారం అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించడంతో పాటు వాస్తవిక వేతనంపై పరిపాలన ఛార్జీలు చెల్లించేందుకు సంబంధిత యాజమాన్యాలు అంగీకారం తెలిపిన ఉమ్మడి ఆప్షన్లు పరిశీలించాలి. అలాగే ఉద్యోగి పింఛను పథకం (ఈపీఎస్)-1995 కింద వాస్తవిక వేతనంపై ఈపీఎస్ చందా చెల్లించిన వాటిని పరిగణించాలి.
* ఈ మేరకు సరైన పత్రాలుంటే ఆ దరఖాస్తులను సంబంధిత సెక్షన్ అధికారి పరిశీలించి, దస్త్రాన్ని సంబంధిత సహాయ లేదా ప్రాంతీయ పీఎఫ్ అధికారికి పంపిస్తారు. ఆ అధికారి ప్రతి దరఖాస్తుకు నంబరుతో పాటు కేటగిరీ, సంస్థ పేరు వివరాలు నమోదు చేసి దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. పత్రాలన్నీ సరిగా లేకుంటే సక్రమంగా చేర్చి ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు.
* దరఖాస్తులు, పత్రాలన్నీ నిబంధనల ప్రకారం సమగ్రంగా ఉంటే, పింఛను నిధికి అదనంగా చెల్లించాల్సిన బకాయిలు లెక్కించి ఆ మేరకు నిధులు జమ చేయాలంటూ నోటీసు జారీ చేస్తారు. గడువులోగా అవసరమైన సమాచారం వస్తే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి దరఖాస్తులను పరిశీలిస్తారు. గడువులోగా సమాచారం రాకుంటే సంబంధిత ప్రాంతీయ పీఎఫ్ అధికారి దరఖాస్తులోని సమాచారానికి లోబడి తగిన ఆదేశాలు జారీ చేస్తారు.
యాజమాన్యాలు ఆమోదించకపోతే..
ఒకవేళ సంబంధిత యజమాని ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు ఆమోదించకపోతే ఆ దరఖాస్తుల వివరాలను ఈపీఎఫ్‌వో క్షేత్రస్థాయి సహాయకుడు తీసుకుని సంబంధిత సెక్షన్ అధికారులకు అందజేస్తారు. సెక్షన్ అధికారి ఆ ఉద్యోగులు, యాజమాన్యాల వివరాలతో దస్త్రం రూపొందించి సంబంధిత ప్రాంతీయ పీఎఫ్ అధికారికి పంపిస్తారు. యాజమాన్యాలు ఆమోదించని కారణంగా ఉమ్మడి ఆప్షన్లను తిరస్కరించినట్లు చందాదారులు, పింఛనుదారులకు సమాచారాన్ని ఇస్తుంది. దరఖాస్తు తిరస్కరణకు ముందుగా సంబంధిత యాజమాన్యాలు పొరపాట్లపై అదనపు సమాచారాన్ని సమర్పించేందుకు నెల రోజుల అవకాశమిస్తుంది.
సరైన సమాచారం, పత్రాలు లేకుంటే..
ఉమ్మడి ఆప్షన్ల దరఖాస్తుల్ని యాజమాన్యాలు ఆమోదించిన తరువాత సరైన పత్రాలు లేకున్నా, దరఖాస్తులో ఏమైనా తప్పులున్నా యాజమాన్యాల నుంచి అదనపు సమాచారం తీసుకునేందుకు వీలుగా క్షేత్రస్థాయి సహాయకుడు వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాలను యాజమాన్యాలు నెల రోజుల్లోగా ఇవ్వాలని సహాయ, ప్రాంతీయ పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల వివరాలను సభ్యులు, పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో తెలియజేస్తుంది. నెల రోజుల్లోగా పూర్తివివరాలు అందిస్తే నిబంధనల మేరకు దరఖాస్తు పరిశీలిస్తారు. లేకుంటే సహాయ, ప్రాంతీయ పీఎఫ్ అధికారి విచక్షణ మేరకు ఆదేశాలు జారీ చేస్తారు.
దరఖాస్తు అనర్హమైతే..
ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు అర్హత లేనిదిగా గుర్తించినపుడు.. అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సంబంధిత యజమాని ద్వారా ఇచ్చేందుకు చందాదారులు, పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో ఒక అవకాశం ఇవ్వనుంది. దరఖాస్తును తిరస్కరించే ముందు పొరపాట్లు సరిచేసుకునేందుకు యాజమాన్యాలకు నెల రోజుల గడువు ఇస్తుంది. ప్రాంతీయ పీఎఫ్ అధికారులు వారానికోసారి దరఖాస్తుల స్థితిపై కేంద్ర పింఛను డివిజన్ కార్యాలయానికి నివేదికలు ఇవ్వాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్-1 (పింఛను) అప్రజిత జగ్గీ తన ఆదేశాల్లో తెలిపారు. చందాదారులు, పింఛనుదారులు అధిక పింఛను దరఖాస్తులపై సందేహాలు, ఫిర్యాదులను ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు.
0 Comments:
Post a Comment