Health Tips | కార్న్ ఫ్లేక్స్‌ను చూడగానే ఎవరికైనా వెంటనే నోరూరుతుంది. తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు కార్న్ ఫ్లేక్స్ మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగానే డయాబెటిక్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.
ఎంతలా అంటే షుగర్ వచ్చిందీ అంటే.. ఆ కామనే లే అనుకునేంతగా. కానీ మధుమేహాన్ని అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదకరం.
అందుకే మధుమేహులు ఆహారపు అలవాట్లను మార్చుకుని, నిత్యం వ్యాయామాలు చేస్తూ షుగర్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా తియ్యని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లరు.
సపోటా, అరటి, సీతాఫలం, మామిడి లాంటి పండ్లు, స్వీట్లు, ఇంట్లో పండుగలు, పబ్బాలకు చేసుకునే పాయసాల జోలికి అసలే వెళ్లరు. ఆలుగడ్డ, చేమగడ్డ లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా దూరం పెడుతారు. అదేవిధంగా బియ్యం స్థానంలో చిరు ధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తారు.
జొన్న, సజ్జ, మక్కజొన్న, రాగులు, ఊదలు, కొర్రలు, అవిసెలు, అరికలు వంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలనే ఎక్కువగా తీసుకుంటారు.
మక్కజొన్నలు తినొచ్చు.. కార్న్ ఫ్లేక్స్ జోలికి వెళ్లొద్దు
అయితే, మక్కజొన్నలను నేరుగా కాల్చుకుని తిన్నా, ఉడికించుకుని తిన్నా ప్రమాదం లేదట. కానీ ఆ మొక్కజొన్నలతో తయారు చేసే కార్న్ ఫ్లేక్స్ మాత్రం మధుమేహులకు చాలా ప్రమాదకరమట.
అందుకే తీపి పదార్థం కాకపోయినా షుగర్ పేషెంట్లు తినకూడని ఆహార పదార్థాల జాబితాలో కార్న్ ఫ్లేక్స్ కూడా చేరిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
గుప్పున వచ్చే కమ్మటి వాసన ముక్కు పుటాలను అదరగొడుతుంది. అందుకే కార్న్ ఫ్లేక్స్‌ను చూడగానే ఎవరికైనా వెంటనే నోరూరుతుంది.
తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు కార్న్ ఫ్లేక్స్ మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉంటుందట.
గ్లైసిమిక్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఉన్న ఆ పదార్థాలను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయట.
ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం. కాబట్టి మధుమేహులు కార్న్ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.
0 Comments:
Post a Comment