Gold Rates: 20 ఏళ్లలో 10 రెట్లు... బంగారం ధర పెరిగిన తీరిదీ
అక్షయం.. అంటే నాశనము లేనిది అని అర్థం.
అక్షయతృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు కొనుగోలు చేసుకున్నా, ఇల్లు/ఫ్లాట్‌కు ఒప్పందం చేసుకున్నా, మరింత సంపద జతచేరుతుందన్నది నమ్మకం. క్రమంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సందర్భంగా పసిడి కొనే అలవాటు పెరిగింది. వివాహాది శుభకార్యాలు ముందున్నందున, శుభముహూర్తంగా భావించి, ఈ సమయంలో ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. తప్పనిసరి అవసరం లేకున్నా సెంటిమెంటుగా బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో మేలిమి బంగారాన్ని పలువురు ఈ సందర్భంగా కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాడు బంగారం ధరలను చూస్తే, అంతకుముందు ఏడాది కంటే మరుసటి ఏడాది ధర తగ్గడం 4 సంవత్సరాల్లోనే కనిపించింది. మిగిలిన అన్ని సంవత్సరాల్లో ధర పెరగడం వల్ల, తమ సంపద విలువ పెరుగుతోందనే సంతృప్తితో స్థోమతకు తగ్గట్లు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈనెల 22న అక్షయతృతీయ నేపథ్యంలో, ఇప్పటికే ఆభరణాలకు బుకింగ్‌లు జరుగుతున్నాయని విక్రేతలు చెబుతున్నారు.
మూడేళ్లలో ధర పెరుగుదల మరీ ఎక్కువ
గత 20 ఏళ్ల వ్యవధిలో అక్షయ తృతీయ తేదీల నాటి ధరలను పరిశీలిస్తే, మొత్తంమీద పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800 కాగా, ఇప్పుడు రూ.62,400కు మించి ఉంది. ముడిచమురు ధరలు పెరగడం ప్రారంభమై, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58% హెచ్చింది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. మళ్లీ కొవిడ్ కేసుల వ్యాప్తి ప్రారంభమైన 2020లో కూడా బంగారం ధర 47% దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21% మేర లాభపడింది.
వ్యాపార అంచనా ఇలా: ఈ పండుగ సందర్భంగా జరిగే వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల్లో 40%, పశ్చిమ ప్రాంతంలో 25%, తూర్పు రాష్ట్రాల్లో 20%, ఉత్తరాదిలో 15% జరుగుతుందనేది బులియన్ వర్గాల అంచనా. వాస్తవానికి ఈ పండుగను మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఎక్కువగా జరుపుతుంటారు.
వ్యాపారుల భావన ఇదీ
దేశీయంగా సగటు కుటుంబీకుల వద్ద నగదు లభ్యత ఉంటే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. తమ సామాజిక హోదాను ప్రతిబింబించడానికి, ఆర్థిక స్థోమతకు చిహ్నంగా ఖరీదైన ఆభరణాలను మహిళలు ధరిస్తుంటారు. ప్రపంచ దేశాల్లో లోహ రూపంలో బంగారానికి మనదేశంతో పాటు, చైనా నుంచే అధిక గిరాకీ ఉంటోంది. ఇప్పటికే అన్నిరకాల వస్తు, సేవల ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.12,000 వరకు పెరిగినందున, గతేడాదితో పోలిస్తే ఈసారి అక్షయతృతీయకు గిరాకీ 10-20% వరకు తగ్గొచ్చనే అభిప్రాయాన్ని ఆలిండియా జెమ్స్ అండ్ జువెలరీ దేశీయ మండలి ఛైర్మన్ సైయమ్ మెహ్రా వ్యక్తం చేశారు. అయితే శుభకార్యాలు ముందున్నవారు, ఈ పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తే శుభమనే భావనతో ముందుకొస్తారనే అభిప్రాయాన్ని తెలుగు రాష్ట్రాల ఆభరణాల వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే కార్పొరేట్ సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా తరుగు, తయారీ ఛార్జీలు, వజ్రాల ధరల్లో ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
0 Comments:
Post a Comment