Gold : బంగారం ధర త్వరలోనే రూ.1 లక్ష దాటడం ఖాయం..అందుకు కారణాలు తెలుసుకుందాం...
బంగారం ప్రస్తుతం 61 వేల రూపాయలు దాటిపోయింది. దీంతో పసిడి ధర అతి త్వరలోనే ఒక లక్ష దాటడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇకపై ఒక గ్రాము కొనాలన్నా, రూ.10,000 ఖర్చు చేయాల్సి వస్తుందా, అని ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధర అతి త్వరలోనే ఒక లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. గడచిన నాలుగు వారాలుగా మనం గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 60 వేల రూపాయలు దాటిపోయింది. దీంతో ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద బంగారం ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. బంగారం ధర భవిష్యత్తులో ఒక లక్ష రూపాయలు దాటడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు పసిడి ప్రియులు మాత్రం బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష రూపాయలు అయితే ఇక ఆభరణాలు కొనుగోలు చేయడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు బంగారం ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది. దీనికి గల కారణాలు ఎంతో మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బంగారం ధర రోజురోజుకు భారీగా పెరుగుతోంది. అయితే మనం చరిత్రలోకి వెళ్లి చూసినట్లయితే సరిగ్గా 23 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో బంగారం ధర 10 గ్రాములకు గాను కేవలం 4,400 మాత్రమే ఉంది. ప్రస్తుతం బంగారం ధర నేడు 61000 దాటింది. అంటే గడచిన 23 సంవత్సరాల్లో బంగారం ధర 15 రెట్లు పెరిగింది. 2010 సంవత్సరంలో బంగారం ధర 18,500 వద్ద పలికింది. గత దశాబ్ద కాలంలోనే బంగారం ధర విపరీతంగా పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు.
ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. అయితే బంగారం ధరలు 2020 సంవత్సరం తర్వాత కొద్దిమేర తగ్గాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర దాదాపు 2000 డాలర్లు దాటింది. దీంతో అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా డాలర్ సంక్షోభం కూడా కారణంగా చెబుతున్నారు డాలర్ బలపడితే బంగారం ధర కూడా తగ్గుతుంది కానీ ప్రస్తుతం డాలర్ ధర బలంగానే ఉన్నప్పటికీ అమెరికన్ బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభం బంగారం ధరలు పెరిగేందుకు దోహదం అవుతున్నాయి.
అమెరికాలో వరుసగా బ్యాంకులు దివాలా తీయడం వల్ల కూడా, ప్రజలు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిష్క్రమించి బంగారం కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూస్తారు. అందుకే బంగారం ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఇదే ట్రెండు కొనసాగితే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు ఒక లక్ష రూపాయలు వరకు తాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టే బంగారం ధర గత మూడు నెలలుగా మన గమనించినట్లయితే విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
0 Comments:
Post a Comment