Devunigutta Temple: చూసొద్దాం రండి : తెలంగాణలో మరో అంగ్ కోర్ వాట్.. ఇలాంటి ఆలయం దేశంలో ఇదొక్కటే...
Devunigutta Temple: దట్టమైన అడవి.. రాళ్లతో కూడిన రహదారి.. మనుషుల వాయిస్ వినిపించని భయంకర ప్రదేశం.. కానీ అక్కడ అందమైన దేవాలయం..
అందులో లక్ష్మీతో కొలువైన నరసింహాస్వామి.. బొమ్మలతో కూడిన ఇటుకలు.. బుద్ధుని చరిత్ర తెలిపే శిల్పాలు.. ఇలాంటి దేవాలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ తెలంగాణలోనూ 6వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడి వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పనే. సాధారణ సమయంలో ఇక్కడికి వెళ్లిన వారు తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా లేదు. కానీ సమీప గ్రామస్తులు ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రతీ మార్చిలో జాతర నిర్వహిస్తారు. ఆలయానికి ఒక్కసారి వచ్చిన వాళ్లు మళ్లీ మళ్లీ రావడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటీ?
చరిత్ర:
ప్రపంచంలోని ముఖ్యమైన మతాల్లో బౌద్ధం ఒకటి. బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 50 కోట్ల వరకు ఉంటారని అంచనా. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలలకు ఆకర్షితులై చాలా మంది బౌద్ధ మతాన్ని స్వీకరించేవారు. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని వారు విశ్వసిస్తారు. అయితే బౌద్ధ మతాన్ని ఆచరించేవారు బుద్ధుడిని శివుడికి ప్రతీకగా భావించేవారు. ఈ క్రమంలో కొన్ని శివాలయాల్లో బుద్దుడి జీవిత చరిత్రను తెలిపే విధంగా శిల్పాలను చెక్కి ప్రతిష్టించేవారు. ఈ ఆలయంపై మహాయాన బుద్ధిజం ఎక్కువగా ప్రభావితం అయినట్లు కనిపిస్తుంది. బౌద్ధ భిక్కులే ఈ ఆలయానికి పునాది వేశారని కొందరు అంటున్నారు. ఈ ఆలయంలో దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధి సత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంది. అయితే ఇది శివుడి వగ్రహమని, హరిసేన హాయాంలోనే హిందూయిజం విస్తరించడానికి ఆలయాన్ని నిర్మించారని కొందరు చెబుతున్నారు. కానీ ఇక్కడున్న శిల్పాల ఆధారంగా దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది.
ఎక్కడ ఉంది?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దట్టమైన ఆడవుల్లో కొలువై ఉందీ ఆలయం. ఇక్కడికి వెళ్లాలంటే హనుమకొండ కు వెళ్లాలి. అక్కడి నుంచి ములుగు (ప్రస్తుతం జిల్లా)కు వెళ్లాల్సి ఉంటుంది. ములుగు కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామ పరిధిలో కొలువై ఉంది. ఈ ఆలయం గుట్టపై ఉండడంతో దీనిని 'దేవుని గుట్ట'గా పిలుస్తున్నారు. 2012 వరకు ఈ ఆలయంలో ఏ విగ్రహం లేదు. కేవలం శిల్పాలతో కూడిన రాళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్తూరు గ్రామస్థులు దీనిని కాపాడుకునేందుకు ఇందులో 2012లోలక్ష్మీ నరసింహాస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతీ మార్చిలో జాతర నిర్వహిస్తున్నారు.
ఆలయం ప్రత్యేకత:
దేవుని గుట్ట ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నలువైపులా రాతి గుండ్లతో పేర్చిన గోడ, ఉత్తరం వైపు సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు, ఒక మూలన పాలరాతి స్తంభం, ఆయక స్తంభానికి నలువైపులా అర్దపద్మాలు ఉంటాయి. అలాగే సింహాల రూపంలో ఉన్న శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. ఆలయం లోపల బుద్దుడి చరిత్రను తెలిపే దృశ్యాలు ఆకట్టుకుంటాయి. బుద్ధుడు బోధనలు చేస్తే రాజు, పరివారలు ఆయన బోధనలు వింటున్న దృశ్యాలను చూస్తే బుద్ధుడి కాలాన్ని గుర్తు చేస్తాయి.
కాలగర్భంలో..!
దట్టమైన అడవి మధ్య ఉన్న ఈ ఆలయం వద్దకు విహార యాత్రకు వెళ్లొచ్చు. కానీ ఇక్కడికి వెళ్లాలంటే రాళ్లతో కూడిన రహదారి ఎదురవుతుంది. అంతేకాకుండా దట్టమైన అడవి కావడంతో మనుషుల జాడ కనిపించదు. అంతేకాకుండా ఆలయం కేవలం ఇటుకలపైనే నిర్మించారు. దీనిని టచ్ చేస్తే కూలిపోయే స్థితిలో ఉంది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చాలా మంది కోరుతున్నారు. లేకుంటే త్వరలో ఈ సుందరమైన ప్రదేశాన్ని చూడకుండానే కనుమరుగయ్యే అవకాశాలున్నాయని గ్రామస్థులు అనుకుంటున్నారు.
ముగింపు:
ప్రపంచంలో అతిపురాతనమైన ఆలయం కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ ల ఉందని తెలుసు. కానీ అంతకంటే ప్రాచీన కాలంలోనే దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకే దీనిని మరో అంగ్ కోర్ వాట్ గా కీర్తిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ ఆలయం ను అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరుగుతారని చాలా మంది భావిస్తున్నారు.
0 Comments:
Post a Comment