విద్యాశాఖకు తెలియకుండానే...బడుల్లో ఉద్యోగాలు చేసేస్తున్నారు!
ఓ సంస్థ పేరిట నిరుద్యోగులను ముంచిన మాయగాళ్లు
ఎట్టకేలకు స్పందించిన అధికారులు
న్యూస్‌టుడే - ఒంగోలు నగరం
కొందరు వ్యక్తులు పాఠశాలల్లో డిజిటల్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాల పేరిట...
పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నియామక పత్రాలు ఇచ్చేశారు. వారంతా వెళ్లి పాఠశాలల్లోనూ చేరిపోయారు. కొద్ది నెలలు విధులు సైతం నిర్వహించారు. ఎట్టకేలకు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారుల దృష్టికి విషయం తెలియకపోవడం గమనార్హం. ఎట్టకేలకు తేరుకుని... ఇటువంటి వ్యక్తుల విషయంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విద్యాంజలి 2.0 పేరుతో ఓ సంస్థ వారు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అసిస్టెంట్, ఇతరత్రా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. జీతాలు సైతం తామే చెల్లిస్తామంటూ... నగదు చెల్లించిన వారికి నకిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ నియామక పత్రాలతో ఒంగోలు మండలం త్రోవగుంటతో పాటు, మరికొన్ని పాఠశాలల్లో వారంతా విధుల్లో చేరారు. వీరికి గత ఆరు నెలలుగా వేతనాలు రాలేదు. తరువాత ఆరా తీయగా... సదరు సంస్థ వారిని మోసగించినట్లు తేలింది. డిజిటల్, రికార్డు అసిస్టెంట్లు పేరిట ఒక్కో పాఠశాలలో రెండు మూడు పోస్టులకు సైతం నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. అందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. మరికొందరికీ వల వేసి వసూలుకు రంగం సిద్ధం చేశారు. సదరు వ్యక్తుల మాటలపై అనుమానం వచ్చిన కొందరు... అసలు ఈ పోస్టులు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సైతం ఆరా తీశారు. ఓ వ్యక్తి స్పందనలో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... ఇన్నాళ్ల పాటు అధికారులు ఈ విషయమై దృష్టికి సారించకపోవడం గమనార్హం.
తెలిసి అప్రమత్తం చేశాం...: ఈ విషయమై డీఈవో పి.రమేష్‌ను వివరణ కోరగా... తాను డీఈవోగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజున ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను కలిశారన్నారు. తాము ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నామని... పాఠశాలల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమించి, వేతనాలు సైతం తామే ఇస్తామని చెప్పారన్నారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇలాంటివి తాము అనుమతిస్తామని వారికి స్పష్టం చేశామన్నారు. మళ్లీ వస్తామని చెప్పి ఇప్పటివరకు రాలేదన్నారు. గ్రామాల్లో నిరుద్యోగులకు ఫోన్లు చేసి వల వేస్తున్నట్లు సమాచారం రావడంతో అందరినీ అప్రమత్తం చేశామన్నారు.
0 Comments:
Post a Comment