న్యూయార్క్: విదేశాల్లో ఉంటూ.. సొంత దేశంపై వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణచివేసే లక్ష్యంగా చైనా(China) అనేక దేశాల్లో అక్రమంగా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇదివరకే వార్తలువచ్చాయి.
తాజాగా అగ్రదేశం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో డ్రాగన్ ఈ తరహా పోలీసు స్టేషన్‌ను నిర్వహిస్తునట్లు వెలుగులోకి వచ్చింది.
ఆ నగరంలో చైనా టౌన్‌లోని ఒక భవనంలో చైనా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ పేరుతో ఒక కార్యాలయం ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు.
ఈ అంశంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని తెలిసి, ప్రస్తుతం దానిని మూసివేశారు. కాగా.. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఈ ఇద్దరు వ్యక్తులు లు జియాన్‌వాంగ్, చెన్ జిన్‌పింగ్ అని అధికారులు వెల్లడించారు. వారికి అమెరికా పౌరసత్వం ఉంది. కానీ వారు చైనా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని తమ అభియోగాల్లో వెల్లడించారు.
ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగాలని చూస్తోన్న చైనా (China).. ఇందుకోసం కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో పలు దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్ పోస్టులను (Police Stations) ఏర్పాటు చేసిందని గతంలో పలు నివేదికలు వెల్లడయ్యాయి.
ఇలాంటి ప్రయత్నాలతో చైనా మానవ హక్కుల (Human rights) ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
విదేశాల్లోని తమ పౌరులకు సహాయం చేసేందుకు 'ఫ్యూజో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (PSB)' పేరుతో ప్రపంచ దేశాల్లో చైనా ప్రభుత్వం పోలీస్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు ఇతర విషయాల్లో స్థానిక పోలీసులకు సహకరించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చైనా చెప్తోంది.
ఇదే సమయంలో ఏదైనా కేసుల్లో చిక్కుకునే చైనీయులను న్యాయం పేరుతో స్వదేశానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.
భద్రతా కారణాలు చెప్పి ఇలా తీసుకువచ్చిన పౌరులను నిర్బంధ క్యాంపులకు తరలించడం, కుటుంబాల నుంచి వేరుచేయడం, వారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తుండడంపై చైనా అధికార కమ్యూనిస్టు పార్టీపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కానీ ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చుతోంది.
0 Comments:
Post a Comment