చైనా యువత (China youth) కొత్త పంథా ఎంచుకుంది. గతంలో ఆ దేశ ప్రజలు నిరంతరం ఏదోక పని చేస్తూనే ఉంటారని, అందువల్ల జీడీపీలో (Gdp) వృద్ధి కన్పిస్తోందని అంతా మాట్లాడుకునేవారు.
ఇప్పుడు మాత్రం అక్కడి 'మిలీనియల్స్', 'జనరేషన్ జడ్' పనిని (Work) పక్కకు పెట్టేశారు. అధిక ఒత్తిడి, శ్రమను తట్టుకోలేక దేవాలయాల (Temples) వైపు అడుగులు వేస్తున్నారు.
దాంతో బుద్ధిజం (Buddhism), టావోయిజం(దావోయిజం) ఆచరించే యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి.
జీవితమంటే పని మాత్రమే కాదు..
ఇటీవలి కాలంలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన కొందరు చైనా యువతీ యువకులు పనికి కాస్త బ్రేక్ ఇచ్చి దేవాలయాలను సందర్శిస్తున్నారు. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు.
నిజానికి ఈ మార్పునకు కొవిడ్ కూడా ఒక కారణమని తెలుస్తోంది. మహమ్మారి ప్రబలిన సమయంలో 16-24 ఏళ్ల యువతకు ఎక్కువగా పనుల్లేకుండా పోయాయి. ఆ సమయంలో జీవితం అంటే పని మాత్రమే కాదు.. ప్రశాంతత కూడా అని తాము తెలుసుకున్నట్లు చైనా యువత పేర్కొంటోంది.
కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గతేడాది నిరుద్యోగిత 17.5 శాతం ఉండగా.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అది 18.1 శాతానికి ఎగబాకింది.
ఇదే ఒరవడి కొనసాగితే దేశ ప్రగతి దెబ్బతింటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యువత దేవాలయాల సందర్శన కారణంగా పర్యాటక రంగం మాత్రం ఊపందుకుందని చెబుతున్నారు.
పండగ తరహాలో అనూహ్య రద్దీ
యువతీ, యువకులు వారాంతాల్లో విహారానికి కాకుండా ఆలయాలకు వెళ్లి అక్కడి జరిగే పూజా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అక్కడ వినిపించే బోధనలతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. బీజింగ్‌లోని 'యోంగె ప్యాలస్' ఒక పురాతన బుద్ధిస్ట్ టెంపుల్. మార్చి నెల ప్రారంభం నుంచి రోజుకు 40 వేల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారట. హాంగ్జూస్‌లోని మరో ప్రసిద్ధ ఆలయం 'లింగ్యిన్ టెంపుల్' బయట నిత్యం భారీ క్యూ దర్శనమిస్తోంది.
కొవిడ్ నిబంధనలు సడలించిన తరువాత నుంచి బుద్ధిస్ట్, టావోయిస్ట్ దేవాలయాల్లో రద్దీ పెరిగింది. యువత తమ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు, అదృష్టం కలిసి రావాలని ప్రార్థించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ దేవాలయాల సందర్శన 310 శాతం పెరిగినట్లు అక్కడి ట్రిప్.
డాట్‌కామ్ లెక్కలు చెబుతున్నాయి. బుద్ధిజం, టావోయిజం, కన్ఫ్యూషనిజం ప్రాచీన చైనాలోని ప్రసిద్ధ మతాలు, తత్వాలు. ఆధునిక చైనా సమాజంలోనూ వీటిని అనుసరిస్తున్నారు. గతంలో పండగల సమయంలోనే వివిధ దేవాలయాల వద్ద ఎక్కువ రద్దీ కనిపించేది.
ఇప్పుడు అన్ని రోజుల్లోనూ పండగ వాతావరణం ప్రతిబింబిస్తోంది. అయితే దేవాలయాలను సందర్శిస్తున్న యువతకు 'మాంక్', 'నన్'లుగా మారే ఉద్దేశం ఎంత మాత్రం లేదని తెలుస్తోంది. కేవలం ప్రశాంతత కోసం అక్కడకు వెళ్లడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.
సామాజిక మాధ్యమాల్లోనూ భక్తి పోస్టులు
ఆలయాలను సందర్శిస్తున్న యువత దైవ దీవెనలుగా భావిస్తూ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో పూసల కంకణాలను అత్యధిక మంది కొని ధరిస్తున్నట్లు తెలిసింది. అలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతున్నారు. సంపన్నులు కావడం, కెరీర్‌లో స్థిరపడటం, చదువులో రాణించడం వంటి కోర్కెలన్నీ నెరవేరుతాయని భావిస్తున్నారు.
పనిలో పనిగా లాటరీ టికెట్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. తాము ధరించిన వస్తువులకు ఆ శక్తి ఉందనే భావనతో ఈ పోకడ పెరుగుతోంది. అంతే కాదు వీటిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. తాము ఫలానా దేవాలయానికి వెళ్లామని, ఇలాంటి పూజా వస్తువులు కొనుగోలు చేశామనే చర్చలు చైనా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కన్పిస్తున్నట్లు సమాచారం.
చైనా యువత చేస్తున్న ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అక్కడి పత్రికలు తప్పుపడుతున్నాయి. యువత కష్టపడి పని చేయడం ద్వారా తమ కలలను నెరవేర్చుకోవచ్చని, ఆలయాల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని కథనాల రూపంలో వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి నాస్తికత్వాన్ని ఎక్కువగా నమ్మే చైనాలో ఆస్తికత్వం దిశగా అడుగులు పడుతున్నాయి.
0 Comments:
Post a Comment