ఆలస్యంగా జీతాలు- పెనాల్టీలు వేయకండి-బ్యాంకుల్ని కోరబోతున్న ఏపీ జేఏసీ అమరావతి
ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసనలకు దిగుతున్న ఉద్యోగులు..
ఇప్పుడు మరో విన్నూత్న కార్యక్రమం చేపట్టబోతున్నారు. జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇవాళ విన్నూత్న రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు రాకపోవడం వల్ల బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారని, దీంతో బ్యాంకులు తమకు పెనాల్టీలు విధిస్తున్నాయని ఏపీ జేఏసీ అమరావతి ఆరోపిస్తోంది. దీంతో బ్యాంకుల్ని కలిసి తమ కష్టాలు విన్నవించుకోవాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఇవాళ ఎస్బీఐ అధికారుల్ని కలిసి బ్యాంకుల ఈఎంఐ చెల్లింపులో ఆలస్యానికి పెనాల్టీలు వేయొద్దని కోరబోతున్నారు.
జీతాలు గతంలో ప్రతీ నెలా ఒకటో తేదీన జమ అయ్యేవని, దానికి తగ్గట్టుగానే ఈఎంఐలు కూడా ప్లాన్ చేసుకున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు జీతాలు కచ్చితంగా జమ కాకపోవడం వల్ల తాము ఈఎంఐలు చెల్లించడంలోనూ ఆలస్యం అవుతోందని, కానీ బ్యాంకులు మాత్రం తమ నుంచి నిర్దాక్షిణ్యంగా పెనాల్టీలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.దీంతో ఇవాళ బ్యాంకు ఉన్నతాధికారుల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు గతంలో జీతాల ఆలస్యం ఉండేదని, ఏప్రిల్ జీతాలు మాత్రం సకాలంలోనే చెల్లించినట్లు తాజాగా ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ప్రకటించారు. కానీ ఉద్యోగుల జేఏసీ మాత్రం తమకు జీతాలు సకాలంలో రాకపోవడం వల్ల ఈఎంఐల చెల్లింపు ఆలస్యమై బ్యాంకులు పెనాల్టీ విధిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment