మహిళల కోసం కొత్త స్కీం.. రెండేళ్లు మాత్రమే.. మంచి రాబడి!
ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‘ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 1.59లక్షల పోస్టాఫీసుల్లో ఈ పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఈ పథకమేంటి..? ప్రయోజనాలేంటి..? ఎలా చేరాలి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలన్నా ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్షలు కనీస పెట్టుబడిగా ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా ఏదేని అధీకృత బ్యాంకులో ఈ ఖాతా తెరవచ్చు. మహిళలు లేదా బాలికల పేరుపై మాత్రమే తీసుకునే వీలుంది. 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోస్టాఫీసుల్లో అందుబాటులోకి
రాగా.. బ్యాంకుల్లో ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఖాతా ఎలా తెరవాలంటే
మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను మహిళలు కానీ, మైనర్ బాలిక తరపున సంరక్షకురాలిగానీ తెరవవచ్చు. ఒకరి పేరు ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారంను తీసుకోవాలి. అందులో వ్యక్తిగత, ఆర్థిక, నామినేషన్ వివరాలను అందించి దరఖాస్తు పూర్తి చేయాలి. ఆ సమయంలో గుర్తింపు, చిరునామా రుజువు కోసం అవసరమైన పత్రాలను (ఆధార్, పాన్) దరఖాస్తు ఫారంతో పాటు సమర్పించాలి. ఆపై డిపాజిట్ మొత్తాన్ని ఎంచుకుని, నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడికి రుజువుగా సర్టిఫికెట్‌ను ఇస్తారు. దీన్ని తీసుకోవాలి.
ప్రయోజనాలు
ఈ స్కీంలో కనిష్టంగా రూ. 1000, గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తానికి ఏడాదికి వడ్డీరేటు 7.5 శాతం పొందవచ్చు. ఈ వడ్డీరేటు మూడు నెలలకొకసారి కలుపుకొని ఖాతాలో జమ అవుతుంది.
మెచ్యూరిటీ, ఉపసంహరణ
డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల తర్వాత డిపాజిట్ మెచ్యూరిటీ పొందుతుంది. ఏడాది తర్వాత పాక్షికంగా నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. డిపాజిట్ మొత్తంలో 40శాతం వెనక్కి ఇస్తారు. గడువు తీరకముందే ఖాతాను మూసివేయడానికి అనుమతించరు. కానీ, ఖాతాదారు చనిపోయినా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నా, ముందస్తుగా ఖాతాను రద్దు చేసుకోవచ్చు. అయితే, ఖాతాను ప్రారంభించి ఆరు నెలలు పూర్తై ఉండాలి.
0 Comments:
Post a Comment