జీతం అందుకోవడం, మదుపు చేయడం లేదా దాచుకోవడం, ఖర్చులు, అప్పులు, ఆస్తి, సంపద ఉంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నాలు.. సగటు మనిషి జీవితం దీని చుట్టూనే తిరుగుతుంటుంది.
డబ్బును ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన జీవితం గడుపుతామంటారు అమెరికాకు చెందిన వ్యక్తిత్వవికాస నిపుణుడు బ్రయన్ ట్రేసీ.
పర్సనల్ ఫైనాన్స్ గురించి క్షుణ్ణంగా వివరిస్తూ 'సైన్స్ ఆఫ్ మనీ' అనే పుస్తకం రాశారాయన.
కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి, అనేక ప్రముఖ కంపెనీలను క్లైంట్లుగా కలిగిన ఒక సంస్థకు అధిపతి అయ్యారు ట్రేసీ.
వివిధ అంశాలపై ఆయన నిర్వహించిన సెమినార్లకు ఇప్పటిదాకా రెండున్నర లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు, అధికారులు హాజరయ్యారు.
ఆయన జీవన ప్రయాణంలో చూసిన, ఆధ్యయనం చేసిన అనేక సంఘటనల నుంచీ నేర్చుకున్న పాఠాలను 'సైన్స్ ఆఫ్ మనీ' పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చారు.
అందులో చెప్పిన ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం.
ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలి?
అప్పులు లేని జీవనం సాగించగలిగితే, సగం కష్టాలు గట్టెక్కుతాయంటారు ట్రేసీ. ఖర్చులు తగ్గించుకుంటే అప్పుల జోలికి పోనక్కర్లేదని చెబుతూ, అందుకు కొన్ని ముఖ్య పద్ధతులను సూచించారు.
వాటిల్లో కీలకమైనది '30 రోజుల వాయిదా'. అంటే ఏదైనా విలాస వస్తువు లేదా అవసరం లేని వస్తువు కొనాలని అనిపిస్తే ఆ విషయాన్ని 30 రోజులు వాయిదా వేయాలి. ఆ ముప్పై రోజుల తర్వాత కూడా ఆ వస్తువు అవసరం అనిపిస్తే అప్పుడు కొనాలి.
ఖర్చులు అదుపు తప్పడానికి అతిపెద్ద కారణం క్షణికావేశంలో అవసరం లేని వస్తువులు కొనడం. ఈ 30 రోజుల వాయిదా పద్దతి వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ట్రేసీ చెబుతున్నారు.
అత్యుత్తమ మదుపు ఏది?
మన అభ్యున్నతి కోసం మనం పడే శ్రమ, వెచ్చించే సమయం అత్యుత్తమమైన మదుపు అంటారు బ్రయన్ ట్రేసీ.
చాలామంది ఉద్యోగం కాకుండా ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే ఆదాయం మీద మక్కువ పెంచుకుని తమ సమయాన్ని ఆ పనులకు ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఇది సరైన ఆలోచన కాదు.
అదే సమయాన్ని మనకున్న నైపుణ్యలు పెంచుకోవడం కోసం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వెచ్చిస్తే ఎన్నో రెట్లు ఆదాయం పెరుగుతుంది.
ఉదాహరణకు ఉద్యోగులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసం వెచ్చించే సమయాన్ని తమ ఉద్యోగానికి సంబంధించిన పనికోసం వెచ్చిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ట్రేసీ తన పుస్తకంలో వివరించారు.
అలవాట్ల సమాహారమే మానవ జీవితం
మనిషి సంఘ జీవి మాత్రమే కాదు, తన అలవాట్లకు బానిస అని నమ్ముతారు ట్రేసీ. అలవాట్లే మనిషి జీవితాన్ని శాసిస్తాయని అనేక ఉదాహరణలతో చెప్పారు.
పురోగతి గురించి ఆలోచించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రేపటి మన లక్ష్యం కోసం ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి.
పర్సనల్ ఫైనాన్స్ ప్రయాణంలో కూడా మంచి అలవాట్లను జీవితంలో భాగంగా చేసుకుంటే మాత్రమే ఆర్థిక స్వావలంబన సాధించగలమని అంటారాయన.
కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకోవచ్చని ట్రేసీ సూచిస్తున్నారు.
ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు చేసే వాళ్లు, ఆ అలవాటును మార్చుకోవడం వల్ల దుబారా ఖర్చును తగ్గించుకోవచ్చు.
జీతం, ఆదాయం, సంపద మధ్య తేడా
మనకు వచ్చే జీతం మన సంపద కాదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటారు ట్రేసీ.
చాలామంది ఎక్కువ జీతం ఉంది కాబట్టి ఎక్కువ సంపద ఉంది అనే అపోహలో ఉంటారు. జీతం పెరిగితే, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది గమనించాల్సి విషయం.
మనకు వచ్చే జీతంలో మదుపు, ఇతర పెట్టుబడులు చేశాక మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఖర్చులకు వినియోగించాలి.
ఈ అంశంలో వారెన్ బఫెట్ దశాబ్దాలుగా ఒకే చిన్న ఇంట్లో ఉండటాన్ని ఉదహరించారు ట్రేసీ. బఫెట్ కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఇన్ని రోజులుగా ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా ఆయన మదుపులో భాగంగా కొన్నదే.
దీర్ఘకాలిక దృక్పథం
హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం, స్టాక్ మార్కెట్ ద్వారా లాభాలు గడించిన వారిలో 85 శాతం మదుపరులు దీర్ఘకాలిక లక్ష్యాలతో మదుపు చేస్తున్నారు.
దీర్ఘకాలిక దృక్పథం అనేది పర్సనల్ ఫైనాన్స్ మూల సూత్రం. పై అధ్యయనంలో కూడా అదే నిరూపణ అయింది.
ట్రేసీ కూడా ఇదే విషయాన్ని సైన్స్ ఆఫ్ మనీ' పుస్తకంలో అనేకసార్లు ప్రస్తావించారు.
ఆర్థికంగా ఎదగడానికి దీర్ఘకాలంలో చక్రవడ్డీ వచ్చే పెట్టుబడులను ఎన్నుకోవడం కీలకమని సూచిస్తున్నారు ట్రేసీ.
కార్యాచరణ ముఖ్యం
ట్రేసీ ప్రకారం, కార్యాచరణ లేకుండా పురోగతి అసాధ్యం. ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారు తగిన కార్యాచరణతో ముందుకు సాగాలి. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు.
విత్తనం లేనిదే మొక్క మొలవదు అలానే మన కార్యాచరణ లేకుండా ఎలాంటి ఆదాయం రాదు.
అప్పుల నుంచి ఎలా బయటపడాలి?
చిన్న మొత్తంలో ఉన్న అప్పులను మొదట తీర్చాలనేది పర్సనల్ ఫైనాన్స్ మూల సూత్రం. ఇదే విషయాన్ని బ్రయన్ ట్రేసీ కూడా చెప్పారు.
అప్పు అనేది విషవలయమని, అందులో చిక్కుకుంటే బయటపడడం కష్టమని అంటారు. సులువైన సంపాదన కోసం వంకర మార్గాలు ఎంచుకోవడం సరి కాదంటారాయన.
ఉదాహరణకు, జూదం. చిన్న చిన్న జూదాలు సరే, లాస్ వేగాస్ లాంటి నగరాలంలో జరిగే భారీ స్థాయి జూదాలకు అలవాటు పడితే, జీవితంలో కిందకు పోవడం తప్ప పైకి రావడం ఉండదని ట్రేసీ హెచ్చరిస్తున్నారు.
జీవితంలో ఆర్థిక అభ్యున్నతికి పాటుపడేవారు జూదానికి దూరంగా ఉండటం అవసరమని సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ - రియల్ ఎస్టేట్
స్టాక్ మార్కెట్‌కు, రియల్ ఎస్టేట్‌కు మధ్య వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గ్రహించాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు పదే పదే చెబుతుంటారు.
ఈ రెండిటికి వేర్వేరు ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వాటికి అనుగుణంగా మదుపు మార్గాలను ఎన్నుకోవాలని నిపుణులు అంటారు.
రియల్ ఎస్టేట్ విషయంలో ఎలాంటి భావోద్వేగాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని ట్రేసీ సూచిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ ద్వారా మదుపు చేసే వారికి ఇండెక్స్ ఫండ్స్ వల్ల లాభాలు కలుగుతాయని, ఆ దిశలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
0 Comments:
Post a Comment