ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యమే గొప్ప సంపద అని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
అలాగే చాలా మంది పైకి హెల్తీగా కనిపించినా.. వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి వారే ఉన్నపాటుగా తీవ్రమైన జబ్బుల బారిన పడుతుంటారు.
మనం తినే ఆహారం, మన జీవనశైలి, అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, వయస్సు వంటి అనేక అంశాలు మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అసలు మనం ఆరోగ్యంగానే ఉన్నామా?లేదా? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. నిపుణుల ప్రకారం.. దీన్ని హాస్పటల్ కు వెళ్లకుండా కూడా తెలుసుకోవచ్చు. అదెలాగంటే..
నిద్ర
ఏదేమైనా ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలంటారు ఆరోగ్య నిపుణులు డాక్టర్లు. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిద్ర ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రాత్రిపూట తగినంత కంటినిండా నిద్రపోతే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టైతే మీరు పడుకున్న 30 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు. ఇలా కాకుండా గంట, రెండు గంటలైనా నిద్రకోసం అటూ ఇటూ పొర్లాడితే మాత్రం మీరు ఆరోగ్యంగా లేనట్టే..
పీరియడ్స్
పీరియడ్స్ ఆడవారి ఆరోగ్యాన్ని వెల్లడిస్తాయి. మీకు సమయానికి పీరియడ్స్ అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ పీరియడ్స్ లేట్ అయినా.. అంతకంటే చాలా తొందరగా అయినా మీ శరీర వ్యవస్థ బాలేదని అర్థం.
రిఫ్రెష్
ఆరోగ్యకరమైన వ్యక్తులు ఎప్పుడూ రిఫ్రెష్ గానే ఉంటారు. వీళ్లు ప్రతిరోజూ, ప్రతి పనిలో చాలా చురుగ్గా ఉంటారు. అలసట అనే సమస్యే ఉండదు.
జ్ఞాపకశక్తి
మంచి జ్ఞాపకశక్తి కూడా మంచి ఆరోగ్యానికి సంకేతమంటున్నారు నిపుణులు. మంచి జ్ఞాపకశక్తి అంటే ఎప్పుడో జరిగిన విషయాలను లేదా ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలను గుర్తుంచుకోవడం.
మలవిసర్జన
మీరు రోజూ మలవిసర్జన చేస్తున్నట్టైతే మీ జీర్ణక్రియ బాగా జరుగుతోందని అర్థం. ఇది కూడా మీరు ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. మీరు ప్రతిరోజూ ఎక్కువ ఇబ్బంది లేకుండా మలవిసర్జన చేయగలిగితే మీ ఆరోగ్యంగా బేషుగ్గా ఉందని అర్థం చేసుకోండి.
మెట్లు ఎక్కడం
మెట్లు కూడా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి. అంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ మెట్లను ఎక్కగలుగుతున్నారో? లేదో? చెక్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మీ ఆరోగ్యంగా బేషుగ్గా ఉన్నట్టే.
మూత్రం రంగు
మీ మూత్రం రంగు కూడా మీ ఆరోగ్యం గురించి చెబుతుంది. అవును మూత్రం రంగు మార్పు ఎన్నో అనారోగ్య సమస్యలకు సంకేతం. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టైతతే మీ మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అంటే మీరు పుష్కలంగా నీటిని తాగుతున్నారని అర్థం.
గాయాలు నయంకాకపోవడం
శరీరంపై ఏవైనా గాయాలు అయ్యాయా? అవి తొందరగా మానుతున్నాయా? లేదా? అనేది చెక్ చేశారా.. ఒకవేళ మీ గాయాలు సకాలంలో మానకపోతే మీ ఆరోగ్యం బాలేనట్టే తెలుసా?
చర్మ ఆరోగ్యం
మీ చర్మం కూడా మీ మొత్తం ఆరోగ్యాన్ని చెబుతుంది. మీ చర్మానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. చర్మం రంగు మారడం, దురద, మచ్చలు వంటి సమస్యలు ఉంటే మీ ఆరోగ్యం బాలేట్టే మరి.
కళ్లు
మీ కళ్ల ద్వారా కూడా మీ ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చంటున్నారు నిపుణులు. కళ్లలో ఎక్కువ తడి, కళ్లు ఎక్కువగా పొడిబారడం అనారోగ్య పరిస్థితులకు సంకేతాలు. అలాగే కళ్లలో అప్పుడప్పుడు అసౌకర్యం లేదా నొప్పి లేదా దురద వంటివన్నీ మీ ఆరోగ్యం బాగా లేవని చెప్తాయి.
వెంట్రుకలు
మీ జుట్టు కూడా మీ ఆరోగ్యాన్ని చెబుతుంది. అవును మీరు ఆరోగ్యంగా ఉంటే.. మీ వెంట్రుకలు రోజుకు 50 నుంచి 100 మాత్రమే ఊడిపోతాయి. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతే మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నట్టేనంటున్నారు నిపుణులు.
నడక
నడవడం అంటే ఇష్టపడేవారుంటారు. ఇష్టపడనివారుంటారు. అయితే ఎవ్వరైనా కొంత దూరం వరకు సునాయాసంగా నడవగలుగుతారు. అయితే మీరు పెద్దగా ఇబ్బంది లేకుండా కొద్ది దూరం నడవగలగాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు.
దంతాలు
మన దంతాల ఆరోగ్యం కూడా మన మొత్తం ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. కొన్ని ఆహారాలు తినేటప్పుడు దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, పంటి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటే మీ ఆరోగ్యం బాలేదని అర్థం చేసుకోవాలి.
0 Comments:
Post a Comment