Bhu Varahaswamy : ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. ఆ కోరికను నెరవేరుస్తున్న 'భూ వరహాస్వామి'..: ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
Bhu Varahaswamy : 'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..' అంటారు పెద్దలు. జీవితంలో అతిపెద్ద కార్యక్రమాలు ఇవి. ఈ రెండు పనులు చేస్తే వారి జీవితం సార్థకమైనట్లేనని భావిస్తారు. ఇక్కడ మనం ఇల్లు గురించి చెప్పుకోవాలి. ఇల్లు కట్టాలంటే కేవలం డబ్బులు ఉంటేనే సరిపోదు. మంచి భూమి కావాలి. నివాస యోగ్యమైన వాతావరణం ఉండాలి. అనుకూల వాతావరణంలో ఇల్లు కట్టుకోవడం అదృష్టంగా భావిస్తారు. కొంత మంది ఎంతో కష్టపడి ఇల్లు కడుతారు. కానీ అందులో ఉండలేక వెంటనే అమ్మేసుకుంటారు. మరికొందరు ఇల్లు మొదలుపెట్టగానే ఏవేవో కారణాలతో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే దైవ తోడు తప్పనిసరి అని అధ్యాత్మిక వాదులు అంటున్నారు. అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి దారిచూసే ఓ దైవం కర్ణాటకలో ఉంది. ఆ క్షేత్రాన్ని దర్శిస్తే మీరు అనుకున్న పని తప్పకుండా చేస్తారని అంటున్నారు. మరి దాని గురించి తెలుసుకుందామా..
ఇల్లు కట్టాలనుకున్నవారు.. కట్టిన ఇంటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలనుకునే భక్తులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో కేఆర్ పేట నుంచి 18 కిలోమీటర్ల దూరంలో కలహళ్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హేమవతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది ఒడ్డున వెలిసింది భూ వరహ స్వామి క్షేత్రం. భూ వరహా ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు ఇల్లు కట్టుకునేవారికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని కొందరు భక్తులు అంటున్నారు. నారాయణుడు, భూమాత కలిసి ఇక్కడ దర్శనమిస్తారు. శ్రీహరి తన కాలుపై కూర్బోబెట్టుకుకొన ముత్యాల పోగు ఇస్తున్నట్లు కనిపిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే సొంత వాహనాలల్లో వెళ్లడమే మంచింది. ఎందుకంటే మారుమూల విలేజ్ కావడంతో ఇక్కడికి సరైన రవాణా సౌకర్యాలు తక్కువే. హేమావతి నదిలో స్నానమాచరించిన తరువాత శ్రీవారిని దర్శించుకోవచ్చు.
జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరాలంటే ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలని స్థానిక పండితులు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం.. ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఇటుకలతో పూజలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటుక పూజ నిర్వహించడానికి ముందుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండు ఇటుకలు ఇస్తారు. వీటితో ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. వీటికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఒకదానిని ఆలయంలో వదిలేయాలి. మరొకటి ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచి కోరిక నెరవేరే వరకు పూజ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత దానిని తీసుకొని మళ్లీ దర్శనానికి రావాలని చెబుతున్నారు.
ఇటుక పూజతో పాటు ఇక్కడ మట్టి పూజ ప్రత్యేకంగా ఉంటుంది. మనం పొలం లేదా భూమి కొనుక్కోవాలని అనుకునేవారు ఆలయం సమీపంలోని కొంత మట్టిని ఇస్తే ప్రత్యేక పూజలు చేసి ఇస్తారు. ఆతరువాత ఒక ముడుపులాగా తయారు చేసి స్వామివారి ఫొటోతో ఇస్తారు. వాటిని ఇంట్లో పూజా మందిరంలో ఉంచి కోరిక నెరవేరే వరకు పూజలు చేయాలి. ఆ తరువాత స్వామి వారి దర్శనానికి వెళ్లాలి. ఇలా తాము అనుకున్న కోరిక నెరవేరే వరకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
భూ వరహా స్వామి ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకువారికి వరాలు ఇస్తాడని తెలియడంతో చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వారం రోజుల పాటు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మధ్యాహ్న సమయంలో అన్న ప్రసాదాలు అందిస్తారు. ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేయించుకోవడం కొంతరు ఆనవాయితీగా భావిస్తారు. వీటికి సంబంధించిన పూజా సామగ్రి ఆలయానికి అందుబాటులో ఉంటాయి.
0 Comments:
Post a Comment