Balagam Movie Brothers: ఏళ్లగా అన్నదమ్ముల స్థలం తగాదా.. బలగం చూసి ఏడ్చేసి ఒక్కటయ్యారు!
Brothers Re union after watching Balagam: కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమా రోజురోజుకు క్రేజ్ తెచ్చుకుంటుంది. మార్చి మూడో తేదీన విడుదలైన ఈ సినిమాని మార్చి 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటికంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నప్పుడు సినిమా మీద ప్రశంసల వర్షం కురవడమే కాదు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డుల వర్షం కూడా కురిపిస్తోంది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో ఈ సినిమాని తెరకెక్కించారు. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ కేవలం రెండు మూడు కోట్లలోనే పూర్తికాగా ఇప్పటికే కేవలం థియేటర్ల ద్వారానే ఈ సినిమా 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తర్వాత తెలంగాణలోని పల్లెల్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి మరి ఊరు అంతా కలిసి సినిమా చూస్తున్నారు.
ఇక ఈ బలగం సినిమాతో ఎప్పుడో స్థల వివాదం కారణంగా విడిపోయిన అన్నదమ్ముల కుటుంబాలు కలవడం హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఈ వ్యవహారం జరిగింది. లక్ష్మణ చాంద గ్రామానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవి అనే అన్నదమ్ములు స్థల వివాదం కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు పడుతున్నారు.
అయితే ఈ గ్రామ సర్పంచ్ ముత్యంరెడ్డి శనివారం ఊరిలో బలగం సినిమాను ఉచితంగా ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన అన్నదమ్ములు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి గొడవలకి స్వస్తి చెప్పాలని భావించి ఆదివారం నాడు కూర్చుని స్థల వివాదాన్ని పరిష్కరించుకుని గ్రామ పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కదా అసలు విజయం అంటే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
0 Comments:
Post a Comment