జగన్ సర్కార్ కు ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరికలు-ఏం జరిగినా మా బాధ్యత లేదు..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏపీ జేఏసీ అమరావతి పోరాటం మరో దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించిన ఉద్యోగులు..
ఇప్పుడు మలి దశ పోరాటం ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అమరావతి సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో వారు భేటీ అయ్యారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత లేదన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని, ఉద్యోగుల మలిదశ ఉద్యమం చాలా ఓర్పుతో, సహనంతో సాగుతోందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు పోరాడుతున్నారన్నారు. ఉద్యమం తీవ్రతరం అయితే మా బాధ్యత కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం 47 రోజులుగా నిరసన తెలియచేస్తున్నామని, ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మరోమారు సీఎస్ కు వివరించామని బొప్పరాజు వెల్లడించారు.
రెండు సార్లు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశాలు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని బొప్పరాజు ఆరోపించారు. ఏపీ ఎన్జీఓవోలు, ట్రేడ్ యూనియన్లతో 28 తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
పీఆర్సీ అరియర్లు, డీఏ అరియర్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పాత అరియర్లు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియకుండా ఉందన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణా తన ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు అన్నీ చెల్లించిందని, కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్ధితి లేదన్నారు.
ఈ నెల 28 న అన్ని ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామని బొప్పరాజు వెల్లడించారు. తెలంగాణాలో ఒక్క డీఏ కూడా పెండింగ్ లో లేదని, ఏపీలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఏ ఊసే లేదన్నారు. 50 పేజీల నివేదిక అంశాలను సీఎస్ కు అందచేశామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్లు అమలు చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
0 Comments:
Post a Comment