న్యూఢిల్లీ: ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్...క్లుప్తంగా...అమూల్ ఇండియా (Amul India) 1948లో ఏర్పాటైన భారతీయ సహకార డెయిరీ సంస్థ. సంస్కృతం పదం 'అమూల్యం' నుంచి 'అమూల్' పదం పుట్టింది.
సంస్కృతంలో అమూల్యం అంటే.. విలువైనది, వెలకట్టలేనిది అనే అర్థం ఉంది. గుజరాత్ (Gujarat)లోని ఆనంద్‌లో పుట్టి భారతదేశంలోని ప్రముఖ ఆహార బ్రాండ్‌గా ఎదిగి, అంతర్జాతీయ మార్కెట్ వరకూ విస్తరించిన క్రెడిట్ అమూల్‌దే.
బెంగళూరులో ఆన్‌లైన్ వ్యాపారానికి సిద్ధం అంటూ...అమూల్ పాల వ్యాపార సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు కర్ణాటకలో(Karnataka) ప్రకంపనలు సృష్టిస్తోంది.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను దెబ్బకొట్టే ప్రయత్నంగా దీనిని పేర్కొంటూ ఆందోళనలు మొదలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ విపక్ష పార్టీలకు ఇది ప్రధాన అస్త్రంగా మారగా, అధికార బీజేపీ డిఫెన్స్‌లో పడింది. ఈ నేపథ్యంలో అమూల్ సుదీర్ఘ చరిత్ర ఏమిటి..? శ్వేతవిప్లవానికి నాందిగా నిలిచి, చలనచిత్రంగా కూడా అవార్డులు, రివార్డులు సాధించిన వైనం ఓసారి చూద్దాం..
అనంద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి..
ప్రతి విజయం వెనుక ఒక ఆరాటం, పోరాటం ఉంటుందనడానికి అమూల్ ఆవిర్భావం ఓ ఉదాహరణ. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఈ గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్.. గుజరాత్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.
దీంట్లో ప్రస్తుతం 3.6 మిలియన్ల పాల ఉత్పత్తిదారులు ఉన్నారు. ఇదంతా నేటి చరిత్ర అయితే, ఈ సంస్థ స్థాపించడానికి దారితీసిన పరిస్థితులు, ఇందుకోసం జరిగిన పోరాటం, శ్లేత విప్లవంతో ఎదిగిన వైనం మరో కోణం.
పద్దెనిమిదవ శతాబ్దంలో అంటే బ్రిటిష్ పాలనలో పాడి రైతుల దోపిడీ ఏకఛత్రాధిపత్యంగా సాగుతుండేది. పాల ధరలను నిర్ణయించుకోలేని దుస్థితి రైతులది.
కైరా నుంచి పాలను సేకరించి ముంబై తదితర ప్రాంతాల్లో సరఫరా చేసేందుకు పోల్సన్ కంపెనీకి గుత్తాధిపత్యం లభించింది. దీంతో పాల ధరలను పోల్సన్ ఏకపక్షంగా నిర్ణయించేది.
రైతులు తమ గోడును స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సర్దార్ పటేల్ దృష్టికి తెచ్చారు. ఆయన చొరవతో రైతులు సహకార సంఘంగా ఏర్పాడి, పోల్సన్‌కు పాలు అందించకూడదని తీర్మానించుకున్నారు.
క్రమంగా గ్రామగ్రామాన సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. పాల పాశ్చరైజ్ మొదలైంది. 1946లో త్రిభువన్‌దాస్ కిషీభాయ్ పటేల్ 'అమూల్' సంస్థను స్థాపించగా, వర్గీస్ కురియన్ జనరల్ మేనేజర్‌గా, సాంకేతిక, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు.
ఆ తర్వాత క్రమంలో ఆయన అమూల్ చైర్మన్‌గా మార్కెట్‌లో విజయం సాధించారు. దేశంలో శ్లేత విప్లవాన్ని అమూల్ ప్రోత్సహించింది. క్రమంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల ఉత్పత్తిదారుగా నిలిచింది.
ఆనంద్‌లోని తొలి ఆధునిక పాడి పరిశ్రమ క్రమంగా సహకార సంస్థ మార్కెట్లో గట్టి పోటీదారుగా నిలిచింది. గుజరాత్‌లోని పాల సహకార సంఘాలు కోట్లాది మంది వినియోగదారులతో 3.1 మిలియన్లకు పైగా గ్రామ పాల ఉత్పత్తులను అనుసంధానించే ఆర్థిక నెట్‌వర్క్‌ను విస్తరించింది.
చలనచిత్ర రూపంలో...
'వర్గీస్ కురియన్ మిల్క్ కోపరేటివ్ మూమెంట్' స్ఫూర్తితో 1976లో హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత శ్యామ్‌బెనగల్ 'మంథన్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వంతో వహించడంతో పాటు వర్గీస్ కురియన్‌తో కలిసి కథ అందించారు.
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు గోవింద్ నిహలానీ సినిమాటోగ్రఫీ అందించారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి వంటి హేమాహేమీలు నటించారు.
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లోని 5 లక్షల మంది సభ్యులు ఒక్కొక్కరు రెండు రూపాలు చొప్పున చిత్రనిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.
విడుదలైన తర్వాత తమ చిత్రాన్ని (తాము నిర్మించిన తమ యదార్థ గాథను) తిలకించేందుకు రైతులు ట్రక్కులలో వెళ్లారు. ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు, 1977లో ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
బిస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డును విజయ్ టెండూల్కర్ అందుకున్నారు. 1976లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా అకాడమీ అవార్డులకు భారతదేశం తరఫున వెళ్లింది.
ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ 'మేరే కామ్ కథా..'ను ఆలపించిన ప్రీతి సాగర్ అదే ఏడాది ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇదే సాంగ్‌ను ఆ తర్వాత క్రమంలో అమూల్ టెలివిజన్ కమర్షియల్‌కు సౌండ్‌ట్రాక్‌గా వాడుకున్నారు.
0 Comments:
Post a Comment