నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : డీఎస్సీ-98 అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. జిల్లాలో 544 మంది అభ్యర్థులు అర్హులు కాగా చివరికి 209 మందికి ఉద్యోగాలిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారీగా కటాఫ్ పెట్టి పోస్టులకు ఎంపిక చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు తీవ్రం నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తాజాగా అనుసరిస్తున్న విధానం పలువురి ఆశలపై నీళ్లు చల్లింది.
రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ విధానం పాటించడం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. మెరిట్ ప్రాతిపదికనే పోస్టులను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిబంధనతో కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు లేకపోవడంతో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి సర్దుబాటు చేశాం.. ఈ పరిస్థితుల్లో రోస్టర్ రిజర్వేషన్ పాటించలేమని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో బలహీన వర్గాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు కోత
ఏడాది క్రితం డీఎస్సీ-98 అభ్యర్థులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేయడంతో అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేశారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు పూలు చల్లి కేకులు కోశారు. క్రమంగా పోస్టుల్లో కోతలు పెట్టుకుంటూ వచ్చి 544 మంది అభ్యర్థుల నుంచి 209 మందికి జాబితా కుదించింది.
చివరకు రోస్టర్ రిజర్వేషన్ కాకుండా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తుండటంతో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల్లో ఒక్కరికీ ఉద్యోగాలు రాకుండాపోయాయి. 39 మంది బీసీలకు మాత్రం కొలవులు దక్కనున్నాయి. దీంతో సదరు అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఆది నుంచి వివాదాస్పదమే
1998 డీఎస్సీ తొలి నుంచి వివాదాస్పదంగా మారింది. 25 ఏళ్ల క్రితం నిర్వహించిన డీఎస్సీలో 1600 పోస్టుల భర్తీ జరిగింది.
కాని మౌఖిక పరీక్షల్లో పెద్దఎత్తున అక్రమాలు జరగడంతో ఓసీలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని అప్పట్లో బీసీలు పెద్దఎత్తున ఉద్యమించారు.
దీంతో అప్పటి తెదేపా ప్రభుత్వం సమస్యను పరిష్కరించే క్రమంలో మరో 400 పోస్టులను కొత్తగా తీసుకొచ్చి వాటిని బీసీలతో భర్తీ చేయడంతో వివాదం సద్దుమణిగింది.
కాని క్వాలిఫైడ్ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు మలుపులు తిరిగిన క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన అనంతరం పోస్టులకు కోత పెట్టడంతో మరోసారి వివాదంగా మారింది.
ఇంతలోనే రోస్టర్ రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో బడుగు, బలహీనవర్గాల అభ్యర్థుల్లో మరోసారి నిరాశే మిగిలింది.
0 Comments:
Post a Comment