రూ.300ల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదలపై టీటీడీ కీలక సూచన
తిరుపతి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవ్వాళ విడుదల చేయనున్నారు.
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల కానున్నాయి. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. భక్తులు దర్శన టికెట్ల కోసం టీటీడీ అధికారిక మొబైల్ యాప్ TTDevasthanams ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు. కొద్దిరోజులుగా టీటీడీ, తిరుమల పేరుతో విచ్చలవిడిగా నకిలీ వెబ్‌సైట్లు వెలుస్తోన్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి 40 వెబ్‌సైట్ల మీద తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
వాటి యజమానులపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని గుర్తు చేశారు. ఇటీవలే మరో వెబ్‌సైట్ కూడా భక్తులను మోసగిస్తోన్నట్లు తేలిందని వివరించారు. ఒక ఫోన్ నంబర్‌పై 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఆరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి.
అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లను భక్తులకు కేటాయించారు. అదేవిధంగా- కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను ఈ నెల 20వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అయ్యాయి. అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
తిరుమలలో మే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణువాసం వంటి వసతి గదులకు సంబంధించిన మే నెల గదుల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వసతి గదులను బుక్ చేసుకోవడానికి కూడా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే భక్తులు సందర్శించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment