Urbanization : తెలంగాణలో పట్టణాలు పెరుగుతున్నాయి. ఇది జాతీయ సగటుతో పోల్చితే చాలా ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 47.6% మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
భారతదేశంలోని మొత్తం జనాభాలో 35.1% జనాభా మాత్రమే నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే దేశ సగటు కంటే తెలంగాణలోనే పట్టణ జనాభా ఎక్కువగా ఉంది. 2036 నాటికి ఇది 18.3 శాతానికి పెరుగుతుందని ఒక అంచనా.
2023లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 1.8 కోట్ల మంది ప్రజలు 2036 నాటికి 2.3 కోట్లకు పెరుగుతారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జనాభా కమిషన్ అభిప్రాయపడింది.
అదే కాలంలో, జాతీయస్థాయిలో పట్టణ ప్రాంతంలో ఉండేవారు 2023లో 35.1% ఉండగా, 2036 నాటికి 39.1%కి పెరుగుతారని ఒక అంచనా.
ఈ ప్రకారం తెలంగాణ పట్టణ జనాభా దేశ సగటు కంటే 12.5% ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ తేడా 2036 నాటికి 18.3%కి పెరుగుతుంది. ఈ ప్రకారం భారతదేశానికంటే తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ పట్టణీకరణకు ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2020 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 142 పురపాలకలకు ప్రభుత్వం 4,304 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధుల్లో 3,936 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఈ నిధులలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సింహభాగం కేటాయించారు. 2,276 కోట్లు హైదరాబాదులోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు.
మిగతా అన్నిధులను 141 మున్సిపాలిటీలకు కేటాయించారు. పురపాలక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేసింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఫిబ్రవరి 2022 వరకు ప్రతినెల 116 కోట్లు విడుదల చేసింది.
పర్యావరణ పరిరక్షణ కోసం, పారిశుద్ధ్య పర్యవేక్షణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 61 కోట్లు, ఇతర పురపాలకాలకు 55 కోట్లు విడుదల చేసింది.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాకుండా ఇతర పురపాలకాల్లో పారిశుధ్య పరిరక్షణ కోసం చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చేసింది.
2165 పారిశుద్ధ్య వాహనాల సహాయంతో పురపాలకలోని ఘన వ్యర్ధాల రోజువారి సేకరణ 2,675 టన్నుల నుంచి 4,356 టన్నులకు పెంచారు.
సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు 1,233 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ లు ఏర్పాటు చేశారు. 206 డ్రై సోర్స్ సేకరణ కేంద్రాలతో పాటు చెత్తను తడి, పొడిగా విభజిస్తున్నారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు మరో 229 కంపోస్ట్ బెడ్ల ను ఏర్పాటు చేశారు.
ఈ విధానాల వల్ల పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం గణనీయంగా మెరుగుపడింది.. మరోవైపు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తున్న నేపథ్యంలో యువత ఉద్యోగ అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తోంది.
దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరుగుతున్నది. కేవలం తెలంగాణ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు.
గతంలో ముంబై నగరం అవకాశాలకు కేంద్రంగా ఉండేది.. ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
0 Comments:
Post a Comment