📚✍️ఆనందపురం ఎంఈవో పద్మావతి సస్పెన్షన్
♦️ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చర్యలు
🌻విశాఖపట్నం , న్యూస్టుడే:* ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండల విద్యాశాఖాధికారిణి (ఎంఈవో) ఎస్.ఎస్.పద్మావతిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇటీవల ఎంఈవో పద్మావతి వైకాపా అభ్యర్థికి మద్దతుగా ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం, ఆ సమావేశానికి భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు హాజరవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని వామపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాయి. దాని ఆధారంగా భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్రెడ్డి విచారణ జరిపి రెండు రోజుల క్రితం కలెక్టర్కు నివేదిక పంపారు. దీంతో ఎంఈవోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పలువురు అధికారులపై కోడ్ ఉల్లంఘన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎంఈవో సస్పెండ్ కావడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.
♦️ఏయూ వీసీపై చర్యలకు ససేమిరా
కోడ్ ఉల్లంఘించినందున ఎంఈవోను సస్పెండ్ చేసిన అధికారులు ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వీసీ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వీసీ కనుసన్నల్లో ఏయూ అనుబంధ ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో గత నెల 19న సమావేశం జరిగిందంటూ ఎన్నికల సంఘానికి వామపక్షాలు, తెదేపా వేర్వేరుగా ఫిర్యాదులు చేశాయి. దీనిపై ఈసీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం విచారణ జరిపి, నివేదిక పంపింది. ఆ సమావేశంలో వీసీ పాల్గొన్నట్లు కచ్చితమైన ఆధారాలు దొరకలేదని నివేదికలో తేల్చేసి, చర్యలు తీసుకోలేదని విపక్ష నేతలు ఆరోపించారు.
0 Comments:
Post a Comment