Retirement - ఉద్యోగ విరమణకు ముందే సమాచారం ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ఆరు నెలలు ముందే పూర్తి వివరాలను డీడీవో నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి పంపాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సి.చంద్రమౌళిసింగ్ సూచించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏజీ, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ ఏపీ వారు సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా ఆయన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డిని కలిసి అనంతరం సమావేశానికి హాజరయ్యారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మాట్లాడుతూ పదవీ విరమణ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ దరఖాస్తులను సకాలంలో పూర్తి వివరాలతో తమకు పంపాలని సంబంధిత డీడీఓలను ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ నామినీ, మిస్సింగ్ క్రెడిట్స్ తదితర సమస్యలను త్వరితగతన పరిష్కరిష్కరించడానికి ఈ అదాలత్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. జిల్లాలో పలువురు ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగులు నామినీ వివరాలను నమోదు చేసుకోలేదని తెలిపారు. భవిషత్తులో వారికి రావాల్సిన బెనెఫిట్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా జీపీఎఫ్ ఖాతాలకు ఉద్యోగి నామినీ వివరాలను రికార్డులలో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ బనొత్ రాకేశ్‌నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న ప్రతిపాదనలను, గ్రీవెన్స్‌లను 31 రోజుల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పదవీ విరమణ పొందిన 25 మంది ఉద్యోగుల పెన్షన్ మంజూరు పత్రాలను, ఫైనల్ జీపీఎఫ్ మంజూరు పత్రాలను అందజేశారు. పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‌లో 50 అర్జీలు అందాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సీనియర్ డీఏజీ సాయి గాంధీ, టి.విజయ్‌కుమార్ తిరుపతి జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీకర్ రెడ్డి, ఏటీఓ ప్రసాద్, డీడీవోలు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment