గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాజకుమారి. దుర్యోధనుని తల్లి.
దుర్యోధనుడితో కలిపి 101 మందిని కన్నది. కంటికి పక్కనున్న వస్తువు కూడా కనిపించనంతగా.. ఒక తెరలాగా జడివాన కురిస్తే.. అది నిరుపయోగంగా ఉంటే అప్పుడు అలాంటి వానను గాంధారి వాన అంటారు.
ఇది అడవిగాచిన వెన్నెల లాంటి పదం. అవసరం లేనప్పుడు, అదను లేనప్పుడు కురిసే పెద్దవానను గాంధారి వాన అంటారు. ఇది తెలుగులో జాతీయం.
మరి కన్ను కనిపించనంత వానని దృతరాష్ట్ర వాన అనవచ్చు కదా… గాంధారి వాన అని మాత్రమే ఎందుకు అంటున్నారు అనే అనుమానం మీకు రాక మానదు. ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్లు లేవు.
కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని తెలిసిన మరుక్షణం తాను కళ్ళకు గంతలు కట్టుకుంది. తన పిల్లలను సైతం కంటితో చూడలేదు. తడిమి చూసి వారి గురించి తెలుసుకునేది.
వారి పెంపకం, వారి బాగోగులు పట్టించుకోకుండా కేవలం వారిపై అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపింది.
గాంధారి వాన కూడా మన పంట అదునుతో సంబంధం లేకుండా కురియడం వల్ల.. గాంధారి పిల్లల్లాగే.. పంటలు సైతం పాడవుతాయి.
అందువల్ల అలాంటి నిరుపయోగమైన మంచి వర్షాన్ని కూడా గాంధారి వాన అంటారు. ఈ మాట ప్రకాశం, రాయలసీమ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉపయోగించబడుతుంది.
0 Comments:
Post a Comment