Ragi Vada For Breakfast : రాగి వడ ట్రై చేయండి.. టేస్టీ టేస్టీగా ఉంటుంది
రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులను పిండిలా చేసుకుని.. చపాతీలు, జావ చేసుకుంటారు. రాగులతో చాలా ఆరోగ్యం. కొత్త కొత్త వంటకాలను తయారుచేసుకోవచ్చు.
ఉదయం అల్పాహారంగా తీసుకునేందుకు రాగి వడలను తయారు చేయండి. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..
తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి మిర్చి-రెండు, కరివేపాకు-ఒక రెమ్మ, శనగపిండి-అర కప్పు, నూనె సరిపడా, ఉల్లిపాయ ఒకటి, పల్లీలు 150 గ్రాములు, రాగి పిండి-ఒక కప్పు, రుచికి సరిపడా ఉప్పు.
ముందుగా పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకులను చిన్నగా తరగాలి. అనంతరం ఓ పాత్రలో రాగి పిండి, శనగపిండితోపాటుగా తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకోవాలి. పలుకులుగా చేసి పిండిలో కలిపేసుకోవాలి. తర్వాత సరిపడా నీటిని పోసి వడల పిండిలా కలపాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత.. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని.. చేతితో ఒత్తుతూ నూనెలో వేసి కాల్చుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా చేస్తే.. రుచికరమైన రాగి వడలు తయారు అవుతాయి. పల్లీ, కొబ్బరి చట్నీలో కలిపి తినండి.. టేస్ట్ అదిరిపోతుంది.
రాగులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. బరువు తగ్గడంలో, షుగర్ ను అదుపులో ఉంచేందుకు, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, ఎముకలను బలంగా చేయడం, రక్తహీనత సమస్యను బయటపడేసేందుకు రాగులు ఉపయోగపడతాయి. అయితే రాగి జావ అందరికీ తెలుసు. దానిని ఉదయం పూట తీసుకుంటే.. స్ట్రాంగ్ అవుతారు. రోజూ రాగి జావ తీసుకోలేని వారు.. అల్పాహారంగా తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో చేసుకునే వాటిల్లో రాగి రొట్టె కూడా ఒకటి. చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ.
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి-2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ-1, తరిగిన పచ్చిమిర్చి-2, క్యారెట్ తురుము-పావు కప్పు, ఉప్పు-కొద్దిగా, కొద్దిగా తరిగిన కొత్తిమీర, నెయ్యి-ఒక టేబుల్ స్పూన్, తగినన్ని వేడి నీళ్లు.
మెుదట ఓ గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తి మీర వేసి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసి కలపాలి. ఇక తగినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ ను తీసుకుని.. దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. తర్వాత పిండిని కొంచెం తీసుకుని.. చేతితో రొట్టెలాగా ఒత్తుకోవాలి.
ఇక స్టౌవ్ మీద పెనం పెట్టాలి. వేడి అయ్యాక.. వేసి కాల్చాలి. దీనిపై నూనె వేస్తూ.. రెండు వైపులా.. ఎర్రగా అయ్యే వరకూ కాల్చుకోవాలి. ఇక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా రాగి రొట్టె తయారు అవుతుంది. చట్నీ లేదా రైతాతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. రాగి పిండితో రొట్టెలు చేసుకుని.. తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
0 Comments:
Post a Comment