Municipal- మున్సిపల్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్..
ముసాయిదా విడుదల.. జిల్లా యూనిట్‌గా ఇకపై నియామకాలు, బదిలీలు
4 పట్టణ విభాగాలకు ఒకే కేటగిరీ.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ యథాతథం
పదోన్నతుల్లేకుండా నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో గ్రేటర్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ప్రస్తుతం వేర్వేరుగా నిబంధనలున్నాయి. ఈ నాలుగు విభాగాలను కలిపి ఒకే కేటగిరీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఇకపై జిల్లాలో మున్సిపల్ టీచర్లకు ఒకే విఽధమైన రూల్స్ వర్తిస్తాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఉన్న టీచర్లు ఇతర మూడు కేటగిరీల్లో ఎక్కడికైనా వెళ్లే వీలుంటుంది. దీనికి 'ఏపీ మున్సిపల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ యూనిఫైడ్ రూల్స్-2023' అనే పేరును నిర్ణయించారు. హెచ్‌ఎంలు, టీచర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లు కూడా దీని పరిధిలోకి వస్తాయని పేర్కొంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ యథావిథిగా ఉంటుందని తెలిపింది. డీఆర్ కోటా, పదోన్నతులతో నియామకాలకు అర్హతలను వేర్వేరుగా స్పష్టం చేసింది. నిర్దేశిత అర్హత లేకుండా ఎవరినీ నేరుగాకానీ, పదోన్నతి ద్వారాగానీ నియమించకూడదని పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు స్పెషల్ డీఎడ్, స్పెషల్ బీఎడ్ ఉన్నవారు అర్హులేనని తెలిపింది. 45 ఏళ్లు దాటిన వారికి పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అయితే, ఇది ఒక్కసారికే వర్తిస్తుందని స్పష్టంచేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు 18 ఏళ్ల నుంచి 33ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని, కనీసం రెండేళ్ల సర్వీసు లేకపోతే పదోన్నతికి అర్హులు కారని తెలిపింది. పదోన్నతులు, బదిలీలకు వేర్వేరుగా కమిటీలు ఉంటాయని, పాఠశాల విద్య ఆర్జేడీ, డీఈవోలు వీటికి చైర్మన్లుగా ఉంటారని సదరు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వివరించింది.
మున్సిపల్ స్కూల్స్ కనుమరుగు: ఎంటీఎఫ్
కొత్త సర్వీసు రూల్స్‌తో పురపాలక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మున్సిపల్ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో 14 వేల మంది మున్సిపల్ టీచర్లు ఉన్నారని, అయినా కొత్త నిబంధనల్లో ఎక్కడా పదోన్నతి చానల్ పెట్టలేదని అన్నారు. డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులకు మున్సిపల్ టీచర్లు అర్హులు కారా? అని ప్రశ్నించారు. కొత్త విధానంలో సీనియారిటీ జాబితా మారిపోతుందని, 20ఏళ్లుగా పదోన్నతులు వస్తాయన్న ఆశతో ఉన్నవారికి నిరాశే మిగులుతుందని అన్నారు. పురపాలక చట్టం ప్రకారం నియమితులైన టీచర్లకు '74 పురపాలక చట్టం' మాత్రమే వర్తిస్తుందని, పురపాలక ఉద్యోగులకు, టీచర్లకు ఒకే రూల్స్ ఉంటాయని తెలిపారు. కొత్త నిబంధనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
0 Comments:
Post a Comment