విద్యావేత్త అయినప్పటికీ, అర్థశాస్త్ర నిపుణుడైనప్పటికీ 'ఎకానమీ' చిరంజీవిగానే అందరికీ పరిచయమైన వేపాడ చిరంజీవిరావు తెలుగుదేశం పార్టీ మద్దతుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలికి అభ్యర్థిగా పోటీచేశారు.
తొలినుంచి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్లిన వేపాడ ద్వితీయ ప్రాధాన్యత కలిగిన ఓట్లతో విజయం సాధించారు.
మండలిలో తొలిసారి కాలు మోపబోతున్న ఎకానమీ చిరంజీవి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
అనకాపల్లి జిల్లా రావి కమతం మండలం దొండపూడిలో 1972 లో జన్మించారు. కొత్తకోటలో ఇంటర్ చదివారు. డిగ్రీ, బీఈడీ తర్వాత ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, పీహెచ్ డీ చేశారు. 1995లో ఏయూసెట్ లో మొదటి ర్యాంకు సాధించారు. 1996 డీఎస్సీ రాసి ఎంపికయ్యారు.
ఎస్జీటీగా కొలువు ప్రారంబించిన వేపాడ స్కూల్ అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాలలకు అధ్యాపకుడిగా పనిచేస్తూఇటీవలే పదవీ విరమణ చేశారు. ఆయన భార్య నివేదిత విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆరు పుస్తకాలు రాసిన వేపాడ 12 సంవత్సరాలు ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు.
విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని ఆర్ సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో గ్రూప్స్, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వడంతోపాటు పేద విద్యార్థులకు ఎకనమిక్స్ మెటీరియల్ ను వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు.
సామాజిక సేవలో మొదటి నుంచి వేపాడ ముందుండేవారు. కొవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేశారు.
హుద్ హుద్ తుపాను సమయంలో ఏయూ పూర్వవిద్యార్థులతో కలిసి సేవలందించడమేకాదు.. రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు.
స్వగ్రామంలో కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో 1300 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
0 Comments:
Post a Comment