భారతదేశం ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మిక్కిలి హిందూ దేవాలయాలు ఉన్నాయి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలు మనదేశంలో ఉన్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహ స్వామి దేవాలయం. ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలెడు ఉన్నాయి.
మల్లూరు నరసింహ స్వామి చరిత్ర ఇదే
నవ నారసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయం ఆరవ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహ స్వామిని ప్రతిష్టించినట్టుగా చెబుతారు. అయితే ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో స్వామి వారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గునపం తగిలి తన నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామి వారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింప చేశారు.
మానవ శరీరంలా మెత్తగా మల్లూరు స్వామి వారు
అప్పటినుంచి మహా మహిమాన్వితమైన స్వామి వారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగొందుతున్నారు. మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై హేమాచల నరసింహస్వామి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అంతేకాదు నరసింహ స్వామి విగ్రహానికి చాతి పై వెంట్రుకలు కూడా ఉంటాయి. మనం చూపుడువేలుతో విగ్రహం ఛాతిని తాకితే, శరీరం లాగా సున్నితంగా లోపలికి వెళుతుంది.
బొడ్డు నుండి స్రవించే ద్రవం.. స్వామివారికి మనుషుల్లా స్వేదం
అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది. మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమట కూడా వస్తుంది. నరసింహ స్వామి బొడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది. అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
స్వామి పాదాల నుండి చింతామణి జలధార
ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది. రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జల ధార నీటిని తాగిందని, ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు. అంతేకాదు చింతామణి జలధార నీటిని విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు. మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు. ప్రకృతి రమణీయతతో, ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి.
0 Comments:
Post a Comment