Lower fertility rate in japan : జపాన్ లో(Japan) యువత జనాభా బాగా తగ్గిపోయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది.
నానాటికి జపాన్‌లో జననాల రేటు(Birth rate) ఆందోళనకర రీతిలో పడిపోతుండటం జపాన్ ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటు జననాల రేటు తగ్గిపోతుంటే, అటు వృద్ధుల మరణాల రేటు పెరిగిపోతోంది. గతేడాది.. జపాన్‌లో పుట్టిన వారి కన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదైంది. 8లక్షల కన్నా తక్కువ పిల్లలు గతేడాది జన్మించగా.. అదే సమయంలో 10లక్షల మందికి పైగా మరణించారు.
ఫిబ్రవరి 28న ఈ డేటాను విడుదల చేసింది జపాన్ ప్రభుత్వం. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్ తన ఉనికిని కోల్పోతుందని, బతకడానికి తమ దేశంలో ఎవరూ ఉండరని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా సలహాదారు,మాజీ మంత్రి అయిన మసాకో మోరి(Masako Mori)తాజాగా టోక్యోలో ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
""జననాల రేటు క్రమంగా తగ్గడం లేదు, ఇది నేరుగా క్రిందికి వెళుతోంది. ఇలా జరుగుతోందంటే సమాజంలో పిల్లలు తక్కువగా ఉన్నట్టు. ఇదంతా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
పరిస్థితులను చక్కదిద్దకపోతే సమాజంలోని భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుంది. పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి.
రక్షణ రంగంలో రిక్రూట్మెంట్లు తగ్గిపోతాయి. ఇది దేశ భద్రతకు కూడా ముప్పు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి"అని మసాకో మోరి అన్నారు.
కాగా,2008లో జపాన్ జనాభా 12 కోట్ల 81లక్షలుగా ఉండేది. ఇదే అత్యధికం. అప్పటి నుంచి జనాభా తగ్గుతూ వస్తోంది. 2022లో జపాన్ లో 65, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు 29శాతం కన్నా అధికంగా ఉన్నారు.
దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతుండగా.. జపాన్‌లో ఏకంగా జనాభానే తగ్గిపోతుండటం గమనార్హం.
మరోవైపు,పిల్లలను కనేలా ప్రజలను ప్రేరేపించడానికి గతంలో జపాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది.
జనాభా పెరుగుదల ఆవశ్యకతపై పెళ్లైన జంటలకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. అయినప్పటికీ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పిల్లలను కనే తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
పిల్లలను కనాలనుకునే జంటకు ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. పిల్లలను కనాలనుకునే దంపతులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న నజరానా మొత్తాన్ని ఇటీవల రూ.3లక్షలకు పెంచారు.
జపాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 లో జపాన్‌లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు. జపాన్‌లో 2021లో మొత్తం 8లక్షల 11వేల 604 మంది పిల్లలు పుట్టగా, ఆ ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 14 లక్షలకుపైగా ఉంది. ఇక జపాన్‌లో 100ఏళ్లు దాటిన వారి సంఖ్య దాదాపు 90వేల దాకా ఉంది.
0 Comments:
Post a Comment