Home Loan EMI: హోమ్ లోన్ ఈఎంఐ టెన్యూర్ పెరుగుతోంది... వెంటనే మీరేం చేయాలంటే..
హోమ్ లోన్ తీసుకునేప్పుడు రిటైర్మెంట్ వయస్సును దృష్టిలో పెట్టుకొని అప్పటివరకే టెన్యూర్ ఎంచుకోవడం అలవాటు.
58 ఏళ్లకు రిటైర్ అవుతారనుకుంటే 28 ఏళ్ల వయస్సులో హోమ్ లోన్ (Home Loan) తీసుకునేవారు 30 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటారు. అదే 38 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి అయితే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేట్ భారీగా పెంచింది. వరుసగా రెపో రేట్ (Repo Rate) పెంచడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఇప్పటి వరకు ఆర్‌బీఐ 250 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. అంటే 2.50 శాతం వడ్డీ పెరిగినట్టే.
ఆర్‌బీఐ రెపో రేట్ పెంచగానే బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. అయితే కొందరు కస్టమర్లు ఈఎంఐ పెంచుకోకుండా టెన్యూర్ పెంచుకుంటున్నారు. ఇక్కడే వస్తుంది అసలు చిక్కంతా. రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు అని అంచనా వేసి టెన్యూర్ ఎంచుకుంటున్నారు. అయితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచిన ఫలితంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి. లోన్ ఈఎంఐ పెంచుకోకుండా టెన్యూర్ పెంచుకోవడంతో అది కాస్తా రిటైర్మెంట్ వయస్సు దాటిపోతోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్ పెరుగుతోంది. అంటే 58 ఏళ్ల వరకు ఈఎంఐ చెల్లించడం కాకుండా 53 ఏళ్ల వరకు కూడా ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది.
రిటైర్మెంట్ వరకు ఆదాయం ఉంటుంది కాబట్టి హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించవచ్చు. కానీ రిటైర్మెంట్ తర్వాత జీతం, ఆదాయం ముందు ఉన్నట్టు ఉండదు. అప్పుడు ఈఎంఐ భారం అవుతుంది. మరి టెన్యూర్ పెరగకుండా ఏం చేయాలన్న సందేహం హోమ్ లోన్ కస్టమర్లలో ఉంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా ఈఎంఐ పెంచుకోవడమే సరైన మార్గం. కాకపోతే ప్రతీ నెలా ఈఎంఐ కొంత భారం అవుతుంది. కానీ టెన్యూర్ పెంచుకుంటే ఎక్కువ ఏళ్లు హోమ్ లోన్ చెల్లించాల్సి వస్తుంది.
వడ్డీ రేట్లు తగ్గించమని బ్యాంకును రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వడ్డీతో రుణం తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీ క్రెడిట్ స్కోర్ పెరిగినట్టైతే మంచి సిబిల్ స్కోర్ ఉన్నందున వడ్డీ రేటు ఏమైనా తగ్గుతుందేమో బ్యాంకులో కనుక్కోవాలి. లేదా మరో బ్యాంకుకు మీ హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే వడ్డీ రేటు ఏమైనా తగ్గుతుందేమో చూడాలి.
ఒకవేళ మీకు పెద్దమొత్తంలో ఏవైనా డబ్బులు వస్తే హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేసేందుకు ప్రయత్నించాలి. హోమ్ లోన్ ప్రీపేమెంట్ చేసి మీరు హోమ్ లోన్ ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గించుకోవచ్చు.
0 Comments:
Post a Comment