Holi 2023 : హోలీ అంటే రంగుల పండుగ. రంగులను చల్లుకునే పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా సందడి చేసే పండుగ. ప్రతీ పండుగకు చారిత్రక ఐతిహ్యం ఉన్నట్టే హోలీకి కూడా అలాంటి నేపథ్యమే ఉంది.
ఇందుకు సంబంధించి అనేక చారిత్రక గాథలు వాడుకలో ఉన్నాయి. శ్రీకృష్ణుడి కన్నా శ్రీరాముడు ముందుగా అవతరించాడు. ఆయన మర్యాద పురుషోత్తముడు కాబట్టి కఠిన నియమాలు కలిగిన జీవితం గడిపాడు.
ప్రజలందరూ ఆయనను అనుసరించారు. ప్రజల్లో నెలకొన్న ఈ గంభీర స్వభావాన్ని పోగొట్టదలచుకున్నాడు. అందరూ హృదయపూర్వకంగా నవ్వుకుంటూ, ఆనందించే ఒక పండుగ జరపాలనుకున్నాడు. రంగులతో ఆడుకొనే రాసలీలగా అది మొదలయింది.
తర్వాత 'హోలీ పండుగ'గా వినతి కెక్కింది. శ్రీకృష్ణుడు హోలీని చైతన్య తరంగాలు కలిగిన నీటితో ఆడేవాడు. ప్రజలు చైతన్య తరంగాల్లో పూర్తిగా తడిసిపోయేవారు. చైతన్యవంతమైన నీటి వల్ల మనలో పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి.
వ్యతిరేక భావాలు నశిస్తాయి. కాబట్టి పవిత్రమైన భావంతో, హృదయంతో హోలీ పం డుగ జరుపుకోవాలి. హద్దులు మీరకూడదు. ఈ వేడుక ద్వారా పొందే ఆనందాన్నీ, నిర్మలత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ అంతటా వ్యాప్తి చేయాలి.
పూర్వకాలంలో హోలిక అనే రాక్షసి ఉండేది. ఆమె ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్యకశిపుని సోదరి. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి అనేక హింసలకు గురిచేశాడు. చివరకు చంపాలని సంకల్పించాడు.
అగ్ని వల్ల ఎలాంటి ఆపదా కలగకుండా హోలికకు వరం ఉంది. కాబట్టి ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని… మండుతున్న అగ్నిగుండంలో ప్రవేశించాలని ఆమెకు హిరణ్యకశిపుడు చెప్పాడు. వరప్రభావం కలిగిన తన సోదరికి ఎలాంటి ఆపదా కలుగదని అతని నమ్మకం.
కానీ ఆశ్చర్యకరంగా… హోలిక ఆ అగ్నిలో కాలి బూడిదయింది. ప్రహ్లాదుడికి ఎలాంటి ఆపదా కలుగలేదు. ఇదొక మహత్తర సన్నివేశం. అహంభావం దౌర్జన్యపూరితమైన గుణాలు ఉన్నవారు పాపాత్ములుగా మారుతారని దీనివల్ల నిరూపితం అ యింది. ప్రతి సంవత్సరం హోలికను అగ్నిలో దహించడం సంప్రదాయమయింది.
మన సంప్రదాయాల్లో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. తప్పులు చేయడం, హింసించడం, ఇతరులను బాధపెట్టడం లాంటివి చెడు స్వభావాలని మనం అర్థం చేసుకోవాలి.
సహజయోగం ప్రకారం… కుడిపార్శపు రజోగుణతత్త్వం కలిగిన వ్యక్తులు తమలో ఇటువంటి రాక్షస గుణాలను అభివృద్ధి పరచుకుంటారు. మన మెదడులో అలాంటి దుష్ట ఆలోచనలు రానివ్వకూడదు.
వాటికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు. పరస్పరం పేచీలకు, కొట్లాటలకూ దిగడం రాక్షస గుణాలు. ఎవరిమీదా ద్వేషాన్నీ, కోపాన్నీ ప్రదర్శించకండి. ఓర్వలేనితనానికి తావివ్వకండి.
0 Comments:
Post a Comment