దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల (Happiest Countries) జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని (International Day of Happiness) నిర్వహిస్తారు.
దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమతి ( UN) గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా 2023 ఏడాదికి నివేదికను విడుదల చేసింది. మొత్తం 150 దేశాల్లోని డేటాను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం చేసింది.
ఈ జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకోవడం గమనార్హం.
పొరుగు దేశాలైన చైనా(74), నేపాల్ (119), శ్రీలంక (63), బంగ్లాదేశ్(102) భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
ఈ జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
అగ్ర రాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి ఒక స్థానం మెరుగుపరుచుకుని 15వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో లైబీరియా, జింబాబ్వే, కాంగో అట్టడుగున ఉన్నాయి. రష్యా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్.. ఆనందకర దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది. రష్యా 72వ స్థానం దక్కించుకుంది.
2012 నుంచి ఐరాసకు చెందిన 'సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' ఏటా ప్రపంచ ఆనంద నివేదికను వెల్లడిస్తోంది.
గత మూడేళ్ల వ్యవధిలో ఆయా దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, కుటుంబ జీవనం, మానసిక ఆరోగ్యం, జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.
కొవిడ్ పరిస్థితుల తర్వాత చాలా వరకు ప్రజల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మద్దతుగా నిలవడం పెరిగిందని ఈ నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన జాన్ హెల్లీవెల్ చెప్పారు.
0 Comments:
Post a Comment