✍️చదివే సమయం ఏదీ?
♦️గ్రూప్-1 మెయిన్స్‌పై అభ్యర్థుల ఆవేదన.. 85 రోజుల వ్యవధితోనే ప్రధాన పరీక్షలు
♦️గతంలో దాదాపు నాలుగు నెలల గడువు
♦️పరీక్షకు అభ్యర్థుల ‘నిష్పత్తి’పైనా సందేహాలు
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. చాలీచాలని గడువుతో పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధాన పరీక్షల ప్రిపరేషన్‌కు నాలుగైదు నెలల సమయం ఇచ్చేవారని, ఇప్పుడు సమయం కనీసం మూడు నెలలు కూడా లేదని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత 92 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీచేసింది. అనంతరం గత నోటిఫికేషన్‌లో మిగిలిపోయిన 19 పోస్టులను దీనిలో చేర్చి మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటికి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అదే నెల 27న ఫలితాలు విడుదల చేశారు. దీనిలో 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఆ వెంటనే ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయని షెడ్యూలు విడుదల చేశారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు మెయిన్స్ పరీక్షల ప్రారంభానికి మధ్య మూడు నెలలు కూడా గడువు లేదు. కేవలం 85 రోజుల వ్యవధిలోనే ప్రధాన పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. రెండు అర్హత పేపర్లతో కలిపి మెయిన్స్‌లో మొత్తం 7 పేపర్లుంటాయి. వాటికి సిలబస్ కూడా ఎక్కువగా ఉంది. అన్ని పేపర్లకు సన్నద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం అవసరమని, కానీ.. తక్కువ గడువుతోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. మరోవైపు ఏటా ఏప్రిల్ లేదా మే నెలల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు(యూపీఎస్సీ) సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటాయి. గ్రూప్-1 పరీక్ష రాసేవారు, అందులోనూ మెయిన్స్ రాసేవారిలో చాలా మంది యూపీఎస్సీ పరీక్షలూ రాస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూల సమయం చూసుకుని ప్రత్యామ్నాయంగా పరీక్షల తేదీలు ఖరారు చేస్తుంటాయి. కానీ, ఏపీపీఎస్సీ మాత్రం సరిగ్గా ఆ సమయంలోనే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తోంది. దీంతో సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి ఇబ్బందిగా మారుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.
♦️ఇంటర్వ్యూలపై సందేహాలు!
గ్రూప్-1లో ఇంటర్వ్యూలు వద్దనే డిమాండ్లు పెరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. ఆ వెంటనే ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, చిత్రంగా తాజా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి కొద్దిరోజుల ముందు ఇంటర్వ్యూలను పునరుద్ధరించారు. ఇంటర్వ్యూలతో అక్రమాలు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టిన ప్రభుత్వమే తిరిగి ప్రవేశ పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేసుకోవడం కోసమే ఇంటర్వ్యూలు పెడుతున్నారని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూల పునరుద్ధరణపై సరైన వివరణ ఇవ్వలేదు. జాతీయ, అంతర్జాతీయంగా ఉన్నతస్థాయి ఉద్యోగాలన్నిటికీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని, అందుకే పునరుద్ధరించామని పేర్కొంది. అయతే, ఈ విషయం ఇంటర్వ్యూలను రద్దు చేసే ముందు తెలీదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
♦️నిష్పత్తికి ప్రాతిపదిక ఏంటి?
మెయిన్స్‌కు 1:58 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశారు. సాధారణంగా మెయిన్స్‌కు ‘నిష్పత్తి’ ఎంత అనేది ముందుగానే నోటిఫికేషన్‌లో స్పష్టం చేయాలి. కానీ, ఈసారి నోటిఫికేషన్‌లో ఈ వివరాలు చెప్పకుండానే ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అనంతరం నిష్పత్తిపై నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పోస్టుకు 58 మందిని ఎంపిక చేశారు. వాస్తవానికి ఇది 1:50 అని, కానీ ఒకే స్థాయి మార్కులు వచ్చిన వారు ఉండటంతో 58గా మారిందని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఎంతమందిని ఎంపిక చేసినా ముందుగా నోటిఫికేషన్‌లో పేర్కొని ఉంటే సరిపోయేదని అభ్యర్థులు అంటున్నారు. నిష్పత్తిని తొలుత చెప్పకుండా నచ్చినట్లుగా మార్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment