రాష్ట్రంలో బయటి తిండిలో భారీగా ఆహారకల్తీ
451 ఆహార నమూనాల్లో 51 నాసిరకమే
హోటల్స్‌లో అపరిశుభ్రత, నాణ్యతారాహిత్యం
అధికారుల అలసత్వం, ప్రజలకు ప్రాణసంకటం
ఆరోగ్య సూచికల్లో దేశంలోనే మూడోస్థానం
ఆహార భద్రతలో చివరి నుంచి మూడోస్థానం
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లో బయటి ఆహారంతో ప్రజలు అనారోగ్యాన్ని 'కొని'తెచ్చుకుంటున్నారు. ఉరుకుల పరుగుల జీవన శైలిలో ఇంటి తిండికి బదులు బయటి ఆహారంపై ఎక్కువగా ఆధారపడటం వారి ఆరోగ్యం (health)పై తీవ్రప్రభావాన్ని చూపిస్తోంది.
ఆస్పత్రుల పాలై ఒళ్లు, ఇల్లు రెండూ గుల్ల చేసుకుంటున్నారు. నెయ్యి నుంచి నూనె వరకు. పాల నుంచి తేనె వరకు, మాంసం నుంచి మద్యం వరకు.. రోజూ తినే ప్రతి ఆహార పదార్థం (food) తీవ్రస్థాయిలో కల్తీకి గురవుతున్నాయి.
రాష్ట్రంలో ఆహార కల్తీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు తాజా పరిశీలనల్లో వెల్లడైంది. గత నెలలో హైదరాబాద్‌లోని నాచారం రాష్ట్ర ఆహార పరిశోధనశాలలో మొత్తం 459 ఆహార నమూనాలను పరిశీలించగా.. వాటిలో 51 నమూనాలు నాసిరకమని గుర్తించారు.
అంటే 11 శాతం మేర ఆహారంలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి భారత ఆహార భద్రత- ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అంచనాల ప్రకారం, ఆహార పదార్ధాల్లో కనీసం 20 శాతం నాసిరకంగా ఉంటున్నాయి.
రాష్ట్రంలో ఆహారపదార్ధాల నమూనాల సేకరణ పెద్దగా జరగకపోవడంతో విషయం సరిగ్గా వెలుగుచూడటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పాలు, పాల ఉత్పత్తులు, గోధుమపిండి(ఆటా) నూనెలు, పసుపు, కారం, తేనే, చక్కెర, ధాన్యం(గోధుమ, బార్లీ, ఓట్స్), పప్పులు, కాఫీ, టీ, మిఠాయిలు, బేకింగ్ పౌడర్లు, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు, వెనిగర్, కూరపొడులతో ఎక్కువగా కల్తీ జరుగుతోంది.
వీటిని తింటే ఏమవుతుంది?
తినే ఆహార పదార్థాల్లో కల్తీ వలన తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల కొవ్వును నెయ్యిలో కలుపుతున్నారు. దీని వలన తీవ్ర రక్తహీనతతో పాటు గుండె పరిమాణం పెరుగుతుంది.
నూనెల్లో కల్తీ వల్ల కంటి జబ్బులు, కేన్సర్, గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ప్రమాదాలు ఉంటాయి. కారంలో రంగు కోసం ఇటుకపొడి, రంపపుపొట్టు కలుపుతున్నారు. వీటి వలన ఉదర సంబంధిత సమస్యలతో పాటు కేన్సర్ రావచ్చు.
ధాన్యాల్లో కల్తీ వల్ల శరీరంలో విషతుల్యత పెరగడమే కాక కాలేయ సమస్యలు తలెత్తుతాయి. కల్తీ కాఫీ పొడి వలన డయేరియా, టీపొడి వల్ల కాలేయ ఇబ్బందులు, కల్తీ పంచదార వలన మూత్రపిండాల వైఫల్యం, కల్తీ కారంతో కేన్సర్, గడ్డలు, రక్తపోటు పెరుగుదల వస్తాయి.
ఇక ఐస్‌క్రీమ్‌లలో వాషింగ్ పౌడర్, నైట్రెట్ లాంటివి కలపడం వల్ల శరీరంలోని అవయవాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ జరుగుతుందని తెలిసినా అలసత్వమే!
ఆహార కల్తీ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలిసినా, దాన్ని అడ్డుకోవడంలో మాత్రం ఆహార భద్రత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
ప్రజల ఫిర్యాదుల్నీ పట్టించుకోవడం లేదు. హడావిడి కోసం నమూనాలు సేకరించడం, ఆ తర్వాత తమకొచ్చే మామూళ్లతో ఆ నమూనాలను పక్కనపెట్టేయడం షరా మామూలుగా మారిపోయింది.
కొన్ని జిల్లాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, తమ లక్ష్యాలమేరకు కూడా నమూనాలను సేకరించడం లేదు. ఆహారపదార్థాలకు సంబంధించి ప్రతి నెలా కనీసం పది నమూనాలను ల్యాబ్‌లకు పంపించాలని స్వయంగా వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది.
గ్రేటర్ పరిధిలో వందల్లో ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
ఆహార భద్రతలో చివరి నుంచి మూడో స్థానంలో తెలంగాణ
ఆరోగ్య సూచికల విషయంలో రాష్ట్రం ప్రతి ఏటా మంచి స్థానాన్ని సాధిస్తోంది. నీతిఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో దేశంలోనే రాష్ట్రం మూడోస్థానంలో నిలిచింది. కానీ గత ఏడాది ఆహార భద్రత సూచికలో మాత్రం 17 రాష్ట్రాల జాబితాలో చివరి నుంచి మూడో స్థానంలో, అంటే 15వ స్థానంలో ఉంది.
ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఐదు విభాగాల్లో వందమార్కులకు గాను రాష్ట్రానికి కేవలం 34.5 మార్కులొచ్చాయి. 82 మార్కుల్ని సాధించి, తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటేనే దాన్ని అరికట్టగలమని ప్రజలు తేల్చిచెబుతున్నారు. ఇతర రాష్ట్రాల స్థాయిలో శిక్షలు లేకపోవడం, పైపెచ్చు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పరిస్థితి దిగజారిపోతోందని ఆహార రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
కల్తీ ఆహారంతో తీవ్ర అనారోగ్య సమస్యలు
కల్తీ ఆహార పదార్థాలను తినడం వల్ల అనేక రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. ముఖ్యంగా పాల ఉత్పత్తి కోసం జంతువులకు ఇస్తున్న హార్మోన్ల వలన చిన్నారుల్లో హార్మోన్న అసమతుల్యత తలెత్తుతుంది.
కల్తీ కారణంగా అజీర్తి, వాంతులు, విరోచనాలు, లివర్, కిడ్నీ సమస్యలతో పాటు కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. ఆఖరికి తాగే నీటిని కూడా వ్యాపారులు కల్తీ చేస్తున్నారు.
బోర్ల నీటిని మినరల్ వాటర్‌గా అమ్ముతున్నారు. వీటివలన మూత్రపిండాలు దెబ్బతినడం, మతిమరుపు, నరాల సమస్యలు ఎదురవుతాయి. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ముద్ర ఉన్న ఆహార పదార్థాలనే ప్రజలు కొనుగోలు చేయాలి.
- డాక్టర్ ఎంవీ. రావు, కన్సల్టెంట్ ఫిజిషీయన్, యశోద ఆస్పత్రి
0 Comments:
Post a Comment