Financial Planning | ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ మహమ్మారి ఎంతోమందిని మనకు దూరం చేసింది. ముఖ్యంగా ఆర్థికంగా చేదోడుగా నిలిచినవారు లేకుండా పోవడం ఎన్నో కుటుంబాలను కష్టాల్లోకి నెట్టింది.
ఇలాంటి సమయంలో ఫ్యామిలీకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా ఉండడం చాలా ముఖ్యం. కానీ, చనిపోయిన వారిలో చాలా మంది తమ ఆర్థిక విషయాలను రహస్యంగా ఉంచడం పెద్ద సమస్యగా పరిణమించింది.
బ్యాంకు ఖాతాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ మదుపు చేశారు?ఏయే బీమా (Insurance) పాలసీలున్నాయి? వంటి వివరాలను చాలా మంది తమ కుటుంబానికి తెలియజేయకపోవడం వంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
అప్పటికే కావాల్సిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురైతే ఆ కష్టం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పైగా వాటన్నింటిని తవ్వితీయడం వారికి ఓ పెద్ద భారం.
అందుకే దురదృష్టవశాత్తూ దూరమైనా.. కీలక ఆర్థిక వివరాలు యాక్సెస్ చేసుకోగలిగే వెసులుబాటు కుటుంబానికి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
దగ్గరి వారికి చెప్పాలి..
భార్య, పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులు.. ఇలా కుటుంబంలో ఎవరో ఒకరికి ఆర్థిక అంశాల (Financial Matters)ను తెలియజేయాలి. బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, బీమా, రుణాలు, బకాయిలు.. ఇలా అన్నింటికీ సంబంధించి వివరాలను వారికి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అయితే, అవి మరొకరి చేతికి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఉదాహరణకు 'పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫైల్'ను షేర్ చేయడం వంటి చర్యలు ఉత్తమం.
2019 మార్చి నాటికి ఆర్‌బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో రూ.25,000 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయి ఉంటాయి. అందుకే దురదృష్టవశాత్తూ కుటుంబంలో ఒక వ్యక్తి లేకుండా పోయినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వివరాలు ఎవరో ఒకరికి తెలియజేసి ఉంచాలి.
నామినేషన్ తప్పనిసరి..
ప్రతి పొదుపు, మదుపు ఖాతాకు కచ్చితంగా నామినీ (Nominee) ఉండాలి. ఇప్పటికీ ఈ పని చేయకపోతే.. వెంటనే చేయండి. వీలైనంత వరకు నామినీగా కుటుంబంలోని వ్యక్తినే ఎంపిక చేసుకుంటే ఉత్తమం.
కష్ట సమయంలో వారే ఖాతాలు, పెట్టుబడులకు సంరక్షకులుగా ఉంటారు. నామినీలే చట్టబద్ధమైన వారసులైతే.. ఆస్తులను వారికి బదిలీ చేయడంలోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అందుకే నామినీల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే తర్వాత చట్టపరమైన సమస్యలు ఎదురుకావొచ్చు.
వీలునామా సిద్ధం చేయండి..
చాలా మంది వీలునామా (Will)ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ, కొవిడ్ మహమ్మారి దీని ఆవశ్యకత ఏంటో తెలియజేసింది. వారసుల మధ్య తర్వాత ఎలాంటి తగువు రాకుండా జాగ్రత్త వహించాలి. ఎవరికి ఏ ఆస్తి, ఎంత వాటా చెందాలో ముందే నిర్ణయిస్తే మంచిది. వీలునామాను రిజిస్టర్ చేయించాలి. ఒకవేళ ఆస్తి తగాదాలు కోర్టు వరకు వెళితే.. రిజిస్టర్ అయిన వీలునామాను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుంది. న్యాయవాదిని సంప్రదిస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.
లాకర్ ఖాతాల్లో జాగ్రత్త..
కొంత మంది కీలక పత్రాలు, బంగారం, డబ్బు.. వంటి వాటిని లాకర్‌లో దాచిపెడతారు. ఒకవేళ లాకర్ ఖాతా ఒక్కరి పేరుమీదే ఉంటే.. వారు దూరమైన పక్షంలో మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు.
ఒకవేళ జాయింట్ ఖాతా అయితే మాత్రం.. ఖాతా తెరిచేటప్పుడే యాక్సెస్ అనే ఆప్షన్ దగ్గర 'ఎయిదర్ ఆర్ సర్వైవర్ (Either or Survivor)' అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. లేదంటే జాయింట్ ఖాతా అయినప్పటికీ.. ఇద్దరిలో ఎవరో ఒకరు దూరమైతే కచ్చితంగా మరణ ధ్రువీకరణను సమర్పించాల్సిందే. పైన తెలిపిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే ఆ అవసరం ఉండదు.
అంత సులభం కాదు..
కుటుంబంలో ఓ వ్యక్తి లేకపోయినా.. వారి డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు.. అనుకుంటే పొరపాటే. అలా చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయం బ్యాంకు దృష్టికి వెళితే చర్యలు తప్పవు. మరోవైపు నామినీలు సైతం కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంటుంది.
0 Comments:
Post a Comment