2021-22 లేబర్ ఫోర్స్ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్య సర్వే నిర్వహించినట్టు నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద చూస్తే.. 8 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది.
మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది.
2019-20లో జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 968కు పెరిగింది.
అలాగే రాష్ట్రంలో 2019-20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 1,046కు పెరిగింది.
గ్రామాల్లోకన్నా పట్టణాల్లోనే ఎక్కువ
2021-22లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,038 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,063 మంది అమ్మాయిలున్నారు.
అలాగే 2019-20లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,007 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,051 మంది అమ్మాయిలున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లోనే అమ్మాయిల సంఖ్య అత్యధికంగా ఉంటోందని స్పష్టమవుతోంది.
ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనే ధోరణి నుంచి క్రమంగా మగైనా ఆడైనా ఒకరే చాలనే వరకూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆడిపిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అక్కడ అబ్బాయిలే అధికం
రాష్ట్రంలో మొత్తం 1,41,28,100 కుటుంబాలుండగా.. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100, పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలున్నట్టు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 3.2గా ఉందని నివేదిక తెలిపింది.
కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్- హవేలీ-డామన్-డయ్యూలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు కేవలం 742 మందే ఉన్నారు. ఆ తర్వాత చండీగఢ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 879 మంది, హరియాణాలో 887 మంది, ఢిల్లీలో 891 మంది అమ్మాయిలున్నారు.
2021-22లో దేశంలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు అమ్మాయిలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు
రాష్ట్రం
లింగనిష్పత్తి
కేరళ
1,114
ఆంధ్రప్రదేశ్
1,046
హిమాచల్ప్రదేశ్
1,031
తమిళనాడు
1,026
మేఘాలయ
1,017
ఛత్తీస్గఢ్
1,016
జార్ఖండ్
1,001
0 Comments:
Post a Comment