Dibba Rotti : అల్పాహారంలోకి టేస్టీ దిబ్బ రొట్టె.. ఎలా తయారు చేయాలంటే..
మినప పప్పుతో చేసే.. దిబ్బ రొట్టె ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి ఎంతో బలం వస్తుంది. అయితే ఈ దిబ్బ రొట్టెను చట్నీతో కాకుండా..
తేనె పానకంతో కలిపేసి తినండి. రుచితోపాటుగా ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తయారీ విధానం.. ఇక్కడ తెలుసుకుందాం..
దిబ్బ రొట్టెకు కావల్సిన పదార్థాలు
పొట్టు మినపప్పు-ఒక కప్పు, బియ్యం నూక-ఒకటిన్నర కప్పు, ఉప్పు-తగినంత, జీలకర్ర-అర టీ స్పూన్.
ఎలా తయారు చేయాలంటే..
మెుదట ఓ గిన్నెలోకి మినపప్పును తీసుకోండి. శుభ్రంగా కడగండి. తర్వాత తగినన్ని నీళ్లు పోయాలి. సుమారు 4 గంటలపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో బియ్యం నూకను తీసుకోండి. శుభ్రంగా కడగండి. తగినన్ని నీళ్లు పోసుకుని.. దీనిని కూడా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత మినపప్పును శుభ్రంగా కడిగి జార్ లో వేసి.. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. దిబ్బ రొట్టే కోసం పిండి గట్టిగా ఉండేలా చేయాలి. తర్వాత ఇందులో ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇక అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి లేదా వెన్నను వేసి వేడి చేయాల్సి ఉంటుంది.
నూనె వేడి అయిన తర్వాత కళాయిలో ఐదు లేదా ఆరు గంటెల పిండిని వేయాలి. తర్వాత దీని మీద గాలి బయటకు పోకుండా.. మూతను పెట్టుకోవాలి. మంటపై 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత దిబ్బ రొట్టెను ఇంకోవైపునకు తిప్పాలి. కొంచెం నూనె పోసుకుని.. మరికాసేపు.. కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే.. దిబ్బ రొట్టె తయారు అవుతుంది.
తేనెపానకం తయారీకి కావల్సినవి
బెల్లం తురుము-అర కప్పు, నీళ్లు-పావు కప్పు, దంచిన సోంపు గింజలు-ఒక టీ స్పూన్.
ఇక తేనె పానకం ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. సోంపు గింజలను సైతం వేసి బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. బెల్లం కరిగాక.. మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత దీనిని వడకట్టి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే.. తేనె పానకం తయారవుతుంది. దిబ్బె రొట్టెను తేనె పానకం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
0 Comments:
Post a Comment