Cyber Frauds: కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలు.. ఎల్లప్పుడూ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
టెక్నాలజీ (Technology) అరచేతిలోకి రావడంతో ఆన్‌లైన్ కార్యకలపాలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య అధికమవుతూ వస్తోంది. సైబర్ నేరగాళ్లు కొన్ని పద్ధతులను ఉపయోగించి యూజర్లను మోసం చేస్తున్నారు.
విషింగ్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సిమ్ స్వాప్ తదితర ప్రక్రియల ద్వారా వినియోగదారులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.
* విషింగ్(Vishing)
ఫోన్ కాల్ ద్వారా కస్టమర్లను బుట్టలో వేసుకోవడమే ఈ విషింగ్ ముఖ్య ఉద్దేశం. బ్యాంక్ నుంచో టెలికాం సంస్థ నుంచో ఫోన్ చేస్తున్నామని చెప్పి వినియోగదారులను నమ్మిస్తారు. కేవైసీ అప్‌డేట్ చేయాలని, బ్యాంకు అకౌంట్ అన్‌బ్లాక్ చేయాలని చెప్పి వారికి కావాల్సిన సమాచారాన్ని రాబడతారు.
* ఫిషింగ్(phising)
ఈమెయిల్, మెసేజ్‌ల ద్వారా పాల్పడే సైబర్ నేరమే ఫిషింగ్. బ్యాంకు పేరుతో నకిలీ మెసేజ్‌ని పంపించి అకౌంట్ హోల్డర్లను బురిడీ కొట్టిస్తారు. లింక్‌ని క్లిక్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, అకౌంట్ వివరాలు సమర్పించాలని కోరుతూ మెసేజ్‌లను పంపిస్తారు. ఈ విధంగానే తమ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని కస్టమర్లను ప్రలోభపెట్టి డివైజ్ రిమోట్ యాక్సెస్‌ని రాబడతారు.
* సిమ్ స్వాప్ ఫ్రాడ్(SIM SWAP)
యూజర్లు వాడుతున్న టెలికాం నెట్‌వర్క్ వివరాలు తెలుసుకుని కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తారు. తన ఫోన్ నంబర్‌ని బ్లాక్ చేయాలని కోరతారు. టెలికాలర్లను నమ్మించి యూజర్లు వాడుతున్న ఫోన్ నంబర్‌ని పనిచేయకుండా చేస్తారు. అనంతరం అదే నంబర్‌తో కొత్త సిమ్‌ని తీసుకొని ఫోన్ నంబర్‌తో లింక్ అయి ఉన్న వివరాలను రాబడతారు.
* ఐడెంటిటీ థెఫ్ట్(Identity Theft)
సోషల్ మీడియాల్లోని ప్రొఫైల్స్.. ఈ తరహా మోసానికి ప్రధాన ఆధారం. యూజర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని సైబర్ నేరగాళ్లు డౌన్‌లోడ్ చేసుకుంటారు. వీటి ద్వారా ఫేక్ అకౌంట్‌లను క్రియేట్ చేసి లోన్‌లు అప్లై చేయడం, ఇతరులను డబ్బులు అడగడం వంటివి చేస్తుంటారు.
* పేమెంట్ గేట్‌వే ఫ్రాడ్(Payment Gateway Fraud)
ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో యూజర్లు ఈ పేమెంట్ గేట్‌వే ఫ్రాడ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. అప్లికేషన్ ఫీజు చెల్లించే సమయంలో, పేమెంట్ చేసే ప్రక్రియలో యూజర్‌ని నకిలీ వెబ్‌సైట్‌కి దారిమళ్లించే ముప్పు ఉంటుంది. తద్వారా ఆ డబ్బులను వృథా చేసుకున్నట్లే. ఇదే తరహాలో ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్ ఉంటుంది. ఆకర్షణీయ ప్రకటనలతో కస్టమర్లను ఊరించి నకిలీ వస్తువులు ఆర్డర్ చేయించడం వంటివాటికి సైబర్ నేరగాళ్లు పాల్పడే అవకాశం ఉంది.
ఇలాంటి తరహా సైబర్ నేరాల నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో చూద్దాం.
* ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. లాగిన్ క్రెడిన్షియల్స్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్/ డెబిట్ కార్డుల వివరాలు ఇతరులకు షేర్ చేయడం ఉత్తమం కాదు.
* ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు వివరాలను పున: పరిశీలించాలి. అధీకృత వెబ్‌సైట్ లేదా సంస్థకు చెల్లింపులు చేస్తున్నామా అని నిర్ధారించుకోవాలి.
* యూపీఐ ద్వారా పేమెంట్‌ని స్వీకరించడానికి ఎలాంటి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయకూడదు.
* బ్యాంకు పేరు మీద వచ్చే మెసేజ్‌లు, ఈమెయిల్స్, కాల్స్‌ని జాగ్రత్తగా పరిశీలించాలి. వెబ్‌సైట్ డొమైన్‌లను నిశితంగా గమనించాలి.
* తెలియని అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. వీటి ద్వారా మీ ఫోన్‌లోని సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
* మీ ప్రమేయం లేకుండా ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తే సదరు బ్యాంకుకి వెంటనే ఫిర్యాదు చేయాలి. అలాంటి మెసేజ్‌లను త్వరగా డిలీట్ చేసేయాలి.
* మీ క్రెడిట్/ డెబిట్ కార్డ్స్ వివరాలను భద్రంగా ఉంచుకోండి. అవసరమైతే రోజువారీ లిమిట్‌ని పెట్టుకోండి.
* ముఖ్యంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని ప్రైవసీలో పెట్టండి. మీ ప్రొఫైల్‌ని లాక్ చేసుకోవడం వల్ల ఇతరులు మీ ఫొటో/ పేరును తస్కరించే ప్రమాదం ఉండదు.
0 Comments:
Post a Comment