CM Jagan- AP employees: ఏపీ ఉద్యోగులకు.. సీఎం జగన్ కు తేడా అదే
CM Jagan- AP employees: ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్టుంది ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకుల వైఖరి. పోరాటం చేస్తున్నారు కానీ ఉద్యోగుల కోసం కాదు..
తమ కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల అవసరం వచ్చినప్పుడు చర్చలు జరుపుతున్న ప్రభుత్వం తరువాత మాత్రం వారు ఎక్కడున్నారో అన్న సంగతి మరిచిపోతోంది. చివరకు వారికి జీతాలు ఎందుకు దండగ అన్నట్టు ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటుంది. సాధరణంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తారీఖున ఠంచన్ గా జీతం. అవసరం వచ్చినప్పుడు రుణాలు, ఏడాదికి ఒకసారి బోనస్ లు, ఇంక్రిమెంట్లు, వేతన సవరణలు.. ఇలా అన్నిరకాల బెనిఫిట్స్ లభిస్తాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత క్రేజ్. చివరకు పిల్లను ఇచ్చేవారు సైతం ప్రభుత్వ ఉద్యోగం అయితేనే ప్రాధాన్యిమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగిని వెతికి మరీ పట్టుకొని సంబంధాలు కలుపుకుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రభుత్వ ఉద్యోగాన్ని జగన్ సర్కారు చులకన చేసింది.
గత ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతుతో అంతులేని విజయం సాధించిన తరువాత జగన్ స్వరం మారింది. స్వాంతన చేకూర్చలేదు కదా. వారికి ప్రతిబంధకమైన నిర్ణయాలు తీసుకొని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారికి అంత మొత్తంలో జీతాలు ఎందుకు అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఒకటో తేదీన జీతం అన్నమాట మరిచిపోయేలా చేస్తోంది. మూడో వారం దాటే వరకూ జీతాలు చెల్లిస్తూనే ఉంది. గత కొద్దినెలలుగా ఇదే జరిగింది. వేతన జీవులు గుర్తించుకునేది ఒకటో తారీఖు. అదే తేదీన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి. పాలవాడి నుంచి పేపరు బిల్లుల దాకా.. రేషన్ షాపు నుంచి పిల్లల ఫీజుల వరకూ అదే తేదీన చెల్లింపులు చేస్తారు. ఆర్థికపరమైన అన్ని అంశాలు అదే తేదీ చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే ఉద్యోగులు 'అమ్మో ఒకటో తారీఖు' అని సంబోధిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యం కలిగిన ఒకటో తారీఖు చరిత్రను జగన్ సర్కారు చెరిపేసింది. ఆ తేదీన చెల్లించాల్సిన జీతాలను నెలలో మూడో వారంలో చెల్లిస్తోంది. పింఛనుదారులకు చుక్కలు చూపిస్తోంది.
ఇప్పటివరకూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసే ఉద్యోగులను చూసుంటాం. కానీ ఫస్ట్ టైమ్ జీతాల కోసం రోడ్డెక్కే రాష్ట్రం ఏపీ కావడం జాతీయ స్థాయిలో పరువు పోయింది. 'సకాలంలో జీతాలు ఇప్పించండి మహా ప్రభో.. ఈ విషయంలో చట్టం చేయండి' అంటూ ఉద్యోగులు గవర్నర్ కు విన్నవించే వరకూ పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. గత కొద్ది నెలలుగా ఓపిక పట్టామని.. ఇక కుదరదంటూ ధైర్యం పోగుచేసుకొని ఉద్యోగులు రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఇలా రాజ్ భవన్ కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులను శూల శోధన చేసి.. తప్పిదాలను బయటకు తీసి మరీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కానీ జీతాలు సకాలంలో చెల్లించే ఏర్పాట్లు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
CM Jagan- AP employees
అయితే వైసీపీ సర్కారుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువులుగా మిగిలారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుండి వారిపై ప్రేమ పొంగింది. అందుకే చర్చలు అంటూ హడావుడి చేస్తోంది. గతంలో కూడా అవసరం వచ్చిన ప్రతీసారి చర్చలకు పిలిచింది. సమస్యలు కూడా పరిష్కరించలేదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు నిజానికి డిమాండ్లు కాదు. తమ డబ్బులు తమకు ఇవ్వమనే అడుగుతున్నారు. సమయానికి జీతాలివ్వాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హమీలు.. గత చర్చల సంద్భంగా ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ , పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటి డిమాండ్లు ఉన్నాయి.
ఉద్యోగుల మాట అటుంచితే ఉద్యోగ సంఘాలను ఆకట్టుకోవడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే ఉద్యమం చేస్తామంటే ఎందుకు? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము సీఎం జగన్ కు బంట్రోతులుగా చెబుతున్నారు. ఈ సీఎం ఏలుబడిలో ఉన్నాం కాబట్టి ఆయన నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. సరికొత్త వక్రభాష్యం చెబుతున్నారు. ప్రభుత్వానికి అవసరమొచ్చినప్పుడు.. ప్రభుత్వం సూచనలిచ్చినప్పుడు ఉద్యోగులను వెంటబెట్టుకొని మరీ కలుస్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చుతున్నారు.
0 Comments:
Post a Comment