Chia Seeds: బరువు తగ్గించే ఆహారాల్లో చియా విత్తనాలు ఒక భాగం- వీటితో డయాబెటిస్ అదుపులో.
అవిసె గింజలు, బాదం, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్... ఇలా ఎన్నో రకాల ఆరోగ్యాన్ని అందించే విత్తనాలు మన ఆహారంలో భాగమయ్యాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ చియా సీడ్స్.
ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఆన్ లైన్లో కూడా చియా విత్తనాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటివల్ల బరువు తగ్గడమే కాదు, మధుమేహాన్ని అదుపులో ఉంచే అవకాశం కూడా ఉండడంతో వీటి వాడకం బాగా పెరిగింది. ప్రతి రోజు చియా విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి.
చియా సీడ్స్ పోషకాలతో పుష్కలంగా నిండి ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి. అందుకే చియా సీడ్స్ను ఇప్పుడు సూపర్ ఫుడ్ అని పిలుస్తున్నారు. వీటిని తినడం వల్ల పోషకాహార లోపం కూడా తగ్గుతుంది.
బరువు తగ్గేందుకు
చియా సీడ్స్లో ఫైబర్ ఉంటుందని ముందే చెప్పాము. రోజూ గ్లాసు నీళ్లలో ఈ చియా సీడ్స్ను వేసి నానబెట్టి, ఆ నీళ్లను ఎనిమిది గంటల తర్వాత తాగితే బరువు తగ్గే అవకాశం ఎక్కువ. చియా సీడ్స్ లో ఉండే ఫైబర్ ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. వీటిలో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. ఆహారం తగ్గించినా కూడా పోషకాహార లోపం తలెత్తదు.
మధుమేహులకు
ఇప్పుడు ప్రపంచంలో మధుమేహం సైలెంట్ కిల్లర్ గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ చాప కింద నీరులా పాకేస్తోంది. అందుకే దాన్ని అదుపులో ఉంచే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. చియా సీడ్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెప్పాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు, కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఇంకా ఎన్నో లాభాలు
శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో చియా సీడ్స్ ముందుంటాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల వీరికి నొప్పులు రావు కాబట్టి చియా సీడ్స్ను పొడిగా లేదా జ్యూస్, సలాడ్లలో కలుపుకొని తాగడం మంచిది. ఈ విత్తనాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎముకలు బలంగా పెరుగుతాయి. గుండెకు రక్షణ అందించడంలో కూడా చియా సీడ్స్ ముందుంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి సాయపడతాయి. మాంసాహారం తినని వారికి చియా సీడ్స్ తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఈ సూపర్ ఫుడ్ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. రోజూ ఒక స్పూను చియా సీడ్స్ తిన్నా చాలు. ఎంతో ఆరోగ్యం మీ సొంతం.
0 Comments:
Post a Comment