Carona -కరోనా..ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి -కేంద్రం తాజా మార్గదర్శకాలు..!!
మరోసారి కోవిడ్ కల్లోలం మొదలైంది. నాలుగు నెలల తరువాత మరోసారి కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతున్నాయి.
దీంతో, కేంద్రం అప్రమత్తం అయింది. ఆరు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది.
కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం
దేశంలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు మరోసారి పెరిగాయి. 24 గంటల సమయంలో దేశంలో 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ లో 734 కోవిడ్ కేసులు నమోదు కాగా ఆ తరువాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే ప్రధమం. కరోనా కారణంగా తాజాగా కర్ణాటకలో ఒకరు మరణించినట్లు నిర్ధారించారు. దేశంలో పెరుగులున్న వైరల్ వైరల్ ఇన్‌ఫెక్షన్లు..కరోనా కేసుల వేళ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్‌కూ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో సూచించారు.
ముందస్తు చర్యలు తీసుకోండి
కోవిడ్ కేసులు ఆకస్మికంగా పెరగటం వెనుక కారణాలను అన్వేషించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. నియంత్రణ చర్యల్లో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం అత్యవసరమని కేంద్రం పేర్కొంది. ఎక్కడైనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంటే నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లేఖలో సూచించారు.
టెస్ట్ ట్రాక్, ట్రీట్.. వ్యాక్సినేషన్ వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం కోరింది. అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని కేంద్రం సూచించింది. ఇన్‌ఫ్లుయెంజాతో పాటు కొవిడ్ ప్రభావాన్ని పర్యవేక్షించాలని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సడన్ గా పెరుగుతున్న కేసులు
ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది. దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్న వేళ లక్షణాలు ఎలా ఉంటున్నాయనేది పరిశీలిస్తున్నారు. కోవిడ్ సమయంలో గుర్తించిన లక్షణాలే ఇప్పుడు ఇన్ఫెక్షన్‌లు గానూ వస్తున్నట్లు గుర్తించారు. గొంతు నొప్పి, జ్వరం, అలసట వంటి లక్షణాలనే ఇన్‌ఫ్లుయెంజాతో వైరస్ బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. దీంతో..కోవిడ్ తో పాటుగా వైరస్ ఇన్ఫెక్షన్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
0 Comments:
Post a Comment